ముంబై : సైబర్ మోసాల్లో దిగ్భ్రాంతికరమైన ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. ‘డిజిటల్ అరెస్టు’ స్కామ్లో ఓ ముంబై వృద్ధురాలు (86) ఏకంగా రూ.20.25 కోట్లు నష్టపోయారు. నిరుడు డిసెంబర్ 26 నుంచి ఈ ఏడాది మార్చి 3 వరకు జరిగిన ఈ మోసం భారత్లో సుదీర్ఘ కాలంపాటు కొనసాగిన ‘డిజిటల్ అరెస్టు’ కుంభకోణాల్లో ఒకటిగా నిలిచింది. పోలీస్ అధికారులమని చెప్పుకుంటూ కొందరు సైబర్ కేటుగాళ్లు ఆ వృద్ధురాలికి ఫోన్ చేశారు.
ఆమె ఆధార్ కార్డు దుర్వినియోగమైందని, దాని సాయంతో బ్యాంకు ఖాతా తెరిచి మనీ లాండరింగ్ సహా పలు ఇతర అక్రమ కార్యకలాపాలను నిర్వహించినందుకు కేసు నమోదుచేసి విచారణ జరుపుతున్నామని బెదిరించారు. నేరానికి పాల్పడినట్టు అంగీకరించకపోతే ఆమె కుటుంబాన్ని సైతం కేసులో చేర్చుతామని భయపెట్టారు.