Mumbai : మహారాష్ట్ర రాజధాని ముంబైలో మరాఠీ భాష అంశం మరోసారి చర్చకు దారితీసింది. ముంబైలోని ప్రతి వ్యాపార, వాణిజ్య సముదాయాలు, సెలబ్రిటీ ఔట్లెట్స్, ఫైవ్ స్టార్ హోటళ్లు వంటివి అన్నింటికీ మరాఠీ సైన్‌బోర్డులు తప్పనిసరిగా ఉండాలని ముంబై డిప్యూటీ మేయర్ సంజయ్ ఘాడి హెచ్చరించారు. లేకుంటే శివసేన తరహా దాడులు తప్పవని చెప్పారు. బీఎంసీ (బృహన్ ముంబై కార్పొరేషన్) అధికారులతో8 సమీక్ష అనంతరం సంజయ్ ఘాడి ఈ వ్యాఖ్యలు చేశారు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ముంబైలోని ప్రతి సంస్థ దేవనాగరి లిపిలో మరాఠీ సైన్ బోర్డు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇందుకు సంస్థలకు నెల రోజుల గడువిస్తున్నట్లు పేర్కొన్నారు. నెల రోజుల లోపు మరాఠీ బోర్డులు ఏర్పాటు చేసుకోకుంటే, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. అవసరమైతే శివసేన తరహాలు దాడులు చేస్తామని కూడా హెచ్చరించారు. ఈ విషయంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తామని చెప్పారు. అధికారిక లెక్కల ప్రకారం ముంబై పరిధిలో 9 లక్షల షాపుల వరకు ఉన్నాయి. వీటిలో 5,020 షాపులు ఇంకా మరాఠీ సైన్ బోర్డులు ఏర్పాటు చేసుకోలేదు.
ఈ విషయంలో ఇప్పటికే బీఎంసీ అధికారులు 3,114 షాపులకు జరిమానా విధించారు. మొత్తం రూ.1.91 కోట్లు వసూలు చేశారు. ఫైవ్ స్టార్ హోటల్ అయినా, ఏ సంస్థ అయినా మరాఠీ బోర్డు ఉండాల్సిందేనని, ఒకవేళ అధికారులు చర్యలు తీసుకోకుంటే, వారిపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయంలో అధికారులకు ఇప్పటికే తగు సూచనలు చేసినట్లు బీఎంసీ లా కమిటీ చైర్మన్ దీక్షా కర్కర్ అన్నారు. ఇంకా సైన్ బోర్డులు పెట్టని సంస్థల వివరాలు 15 రోజుల్లోగా సమర్పించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు.