Bangladesh : బంగ్లాదేశ్‌లో హిందువుల భద్రతకు అన్ని చర్యలూ చేపడతామని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారు మహ్మద్ యూనస్ భరోసా ఇచ్చారు. మహ్మద్ యూనస్ తనకు ఫోన్ చేసి ఈ మేరకు హామీ ఇచ్చారని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ప్రొఫెసర్ మహ్మద్ యూనస్ నుంచి ఫోన్‌కాల్ రిసీవ్ చేసుకున్నానని, బంగ్లాదేశ్ పరిస్ధితిపై ఇరువురు అభిప్రాయాలు పంచుకున్నామని ఆ పోస్ట్‌లో ప్రధాని వివరించారు.
ప్రజాస్వామ్య, సుస్ధిర, శాంతియుత, పురోగామి బంగ్లాదేశ్‌కు భారత్ మద్దతుగా నిలుస్తుందని పునరుద్ఘాటించామని చెప్పారు. బంగ్లాదేశ్‌లోని హిందువులందరి భధ్రత విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని, వారిని కాపాడుకుంటామని భరోసా ఇచ్చారని ఆ పోస్ట్‌లో ప్రధాని వివరించారు. ఇక స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో బంగ్లాదేశ్‌లో హిందువుల భద్రతపై 140 కోట్ల మంది భారతీయులు కలత చెందుతున్న క్రమంలో హింస ప్రజ్వరిల్లిన బంగ్లాదేశ్‌లో త్వరలో సాధారణ పరిస్ధితి నెలకొంటుందని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.
మరోవైపు మంగళవారం మహ్మద్ యూనస్ ఢాకాలోని ధాకేశ్వరి ఆలయాన్ని సందర్శించిన క్రమంలో హిందువులతో ముచ్చటించారు. మాజీ ప్రధాని షేక్ హసీనా ఇటీవల పదవి నుంచి దిగిపోయేముందు జరిగిన హింసాకాండలో మైనారిటీలపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామని ఈ సందర్భంగా మహ్మద్ యూనస్ వారికి హామీ ఇచ్చారు.
Read More :
KTR | రేవంత్ రెడ్డి అమెరికా అధ్యక్షుడు కాబోతున్నాడు.. కేటీఆర్ సెటైర్లు