KTR | సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్ వేశారు. బీజేపీలో బీఆర్ఎస్ త్వరలోనే విలీనం అవుతుందని, ఆ వెంటనే కేసీఆర్ గవర్నర్, కేటీఆర్ కేంద్రమంత్రి కాబోతున్నారని రేవంత్ చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి తొందరలోనే అమెరికా అధ్యక్షుడు కాబోతున్నాడని వ్యంగ్యంగా మాట్లాడారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో శుక్రవారం ప్రెస్‌మీట్ పెట్టి మరీ.. రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని కేటీఆర్ ఎండగట్టారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నకు స్పందించిన కేటీఆర్.. రేవంత్ రెడ్డి తొందరలోనే అమెరికా అధ్యక్షుడు కాబోతున్నాడని… అలా నేను కూడా స్టోరీలు చెప్పగలనని అన్నారు.
‘ రేవంత్ రెడ్డి తొందరలోనే అమెరికా అధ్యక్షుడు కాబోతున్నాడు. మనోడు అమెరికా అధ్యక్షుడు అయితడని.. మొన్ననే కేజీఎఫ్‌లో ఏదో మీటింగ్ పెట్టి ఆయనెవరో చెప్పారు కదా.. ఈయనే అయితడేమో మరి’ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ట్రంప్ సరిపోతలేడని.. రేవంత్‌ను పిలుస్తున్నారేమో అని వెటకారంగా అన్నారు.
మాకు రాజీనామాలు కొత్త కాదు.. రేవంత్ రెడ్డికి మోసాలు కొత్త కాదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి మాట తప్పిన సన్నాసి ఎవరని ప్రశ్నించారు.
మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంపై కూడా కేటీఆర్ స్పందించారు. మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. యథాలాపంగా మాట్లాడుతూ ఒక్క మాట అన్నానని.. అందుకే క్షమించాలని సోదరీమణులను అడిగానని చెప్పారు. తాను ముందుకొచ్చి ఆ మాట మాట్లాడానని తెలిపారు. సబితక్క, సునీతక్క, కోవా లక్ష్మక్క గురించి పనికిమాలిన మాటలు మాట్లాడినందుకు క్షమాపణలు చెప్పే ఇంగితం గానీ, సంస్కారం గానీ ఉందా? అని కేటీఆర్ ప్రశ్నించారు. సంస్కారం ఉంటే క్షమాపణ చెప్పాలని కోరారు.