Ayodhya Mosque | హిందువుల ఆరాధ్యదైవం రాముడి జన్మస్థలమైన ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య నగరం మరో మతపరమైన ప్రార్థనా మందిరానికి నిలయంగా మారబోతోంది. ఇప్పటికే అక్కడ రామ మందిరాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద మసీదును అయోధ్య (Ayodhya Mosque) సమీపంలో నిర్మించబోతున్నారు. ఈ మసీదు ఆగ్రాలోని పాలరాతికట్టడం తాజ్‌మహల్ (Taj Mahal) కంటే అందంగా ఉంటుందని మసీదు అభివృద్ధి కమిటీ చైర్మన్ తెలిపారు.
అయోధ్య నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధన్నీపూర్ గ్రామంలో (Dhannipur village) దేశంలోనే అతిపెద్ద మసీదును నిర్మిస్తున్నట్లు మసీదు అభివృద్ధి కమిటీ చైర్మన్, బీజేపీ నేత హాజీ అరాఫత్ షేక్ (Haji Arfat Shaikh) తెలిపారు. రామ మందిరానికి (Ram Temple) 25 కిలోమీటర్ల దూరంలో నిర్మించబోయే ఈ మసీదు తాజ్‌మహల్ కంటే అందంగా ఉంటుందని అన్నారు. ప్రముఖ పత్రిక ఆజ్‌తక్‌తో ఆయన గురువారం ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్బంగా మసీదు ప్రత్యేకతలను వివరించారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ మసీదు నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మసీదు ప్రజలకు నమాజ్ చేసుకోవడానికి మాత్రమే కాకుండా.. ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ మసీదు 500 పడకల క్యాన్సర్ ఆసుపత్రిని కూడా కలిగి ఉండేలా నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు. ఇకపై యూపీ నుంచి క్యాన్స్ర్ చికిత్స కోసం ఎవరూ ముంబై వెళ్లరని ఆయన తెలిపారు.
కాగా, యూపీ ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో మసీదు నిర్మాణం జరగనుంది. 21 అడుగుల ఎత్తు, 36 అడుగుల వెడల్పు ఉండే ప్రపంచంలోనే అతిపెద్ద ఖురాన్‌ను ఈ మసీదులో ప్రదర్శనకు ఉంచనున్నట్లు అరాఫత్ షేక్ తెలిపారు. 9 వేల మంది మహిళలు, పురుషులు ఒకేసారి ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా మసీదు నిర్మాణం చేపడుతున్నట్లు ఆయన వివరించారు. ఈ మసీదుకు మక్కాలోని కాబాలో ప్రార్థనలు చేసే ఇమామ్ సహా పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తామన్నారు. వారు ఇక్కడ మొదట ప్రార్థనలు చేస్తారని అరాఫత్ షేక్ వెల్లడించారు.
Also Read..
MPs suspended | పార్లమెంట్లో కొనసాగుతున్న సస్పెన్షన్లు.. మరో ముగ్గురు ఎంపీలపై సస్పెన్షన్ వేటు
Coronavirus | కలవరపెడుతున్న కొత్త వేరియంట్.. జేఎన్.1 లక్షణాలు ఇవీ
Opposition MPs | సస్పెన్షన్‌పై ప్రతిపక్ష ఎంపీల నిరసన ప్రదర్శన