Coronavirus | మూడేళ్ల కిందట ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ మరోసారి కోరలు చాస్తోంది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన మహమ్మారి ఒక్కసారిగా విజృంభిస్తోంది. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులు అమాంత పెరిగాయి. ఒకవైపు కొవిడ్ కేసులు పెరుగుతుంటే.. మరోవైపు కొత్త వేరియంట్ బయటపడి మరింత కలవరపెడుతోంది. ఇటీవలే కొవిడ్ సబ్ వేరియంట్ జేఎన్.1 (JN.1) గుర్తించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఒమిక్రాన్ సబ్ వేరియంట్ అయిన జేఎన్.1 కేసులు దేశంలో 21 నమోదైనట్లు ఇండియన్ సార్స్ కోవ్-2 జెనోమిక్స్ కన్సార్టియం (INSACOG) వెల్లడించింది. కొత్త వేరియంట్‌తో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరగడానికి ఈ కొత్త వేరియంట్ (New Covid Variant) కారణమని తెలుస్తోంది.
ఇక ఈ కొత్త వేరియంట్ లక్షణాల విషయానికొస్తే.. వైరస్ సోకిన వారిలో జ్వరం, ముక్కు కారడం, గొంతు మంట, తలనొప్పి, విపరీతమైన అలసట, కండరాల బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొంతమందిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, కొన్ని సందర్భాల్లో జీర్ణశయాంతర లక్షణాలు కూడా కనిపిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ లక్షణాలు రెండు రోజుల పాటు కొనసాగితే మాత్రమే కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం ఈ వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
జేఎన్.1ను ‘వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్’ గా వర్గీకరించిన డబ్ల్యూహెచ్‌వో
మరోవైపు జేఎన్.1 వేరియంట్ కారణంగా ప్రజారోగ్యానికి పెద్దగా ముప్పు వాటిల్లదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే స్పష్టం చేసింది. జేఎన్.1ను ‘వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్’ (variant of interest)గా వర్గీకరించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ వేరియంట్ ప్రభావం చాలా తక్కువగా ఉన్నట్లు తెలిపింది. కరోనా బీఏ.2.86 వేరియంట్ నుండి జేఎన్.1 వేరియంట్ ఉద్భవించిందని వివరించింది. అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు జేఎన్.1తోపాటు ఇతర వేరియంట్ల నుంచి కూడా రక్షణ కల్పిస్తాయని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది.
దేశంలో కొత్తగా 358 మందికి కరోనా..
దేశంలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 358 మంది కరోనా (COVID-19) బారినపడ్డారు. అందులో అత్యధికంగా 300 కేసులు ఒక్క కేరళ రాష్ట్రంలోనే వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. ఇక మహమ్మారి కారణంగా 24 గంటల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అందులో కేరళలోనే మూడు మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో 2,669 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.01 శాతం మాత్రమేనని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదేవిధంగా రికవరీ రేటు 98.81 శాతం, మరణాలు 1.18 శాతంగా ఉన్నాయని తెలిపింది. కొవిడ్ జేఎన్.1 వేరియంట్‌కు చెందిన కొత్త కేసులు ప్రధానంగా మూడు రాష్ర్టాల్లోనే నమోదయ్యాయి. గోవాలో 19, మహారాష్ట్ర, కేరళలో ఒక్కొక్క కేసు నమోదయ్యాయి.
Also Read..
Opposition MPs | సస్పెన్షన్‌పై ప్రతిపక్ష ఎంపీల నిరసన ప్రదర్శన
Covid-19 | మళ్లీ కరోనా కలకలం.. ఢిల్లీలో ఏడుగురురికి పాజిటివ్..!