Vehicles Seized | దేశ రాజధాని ఢిల్లీలో అక్టోబర్ ఒకటి నుంచి నవంబర్ 15 మధ్య రవాణాశాఖ 2,234 ఓవరేజ్ వాహనాలను సీజ్ చేసింది. నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నది. గత కొద్ది రోజులుగా ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో గ్రేడెడ్ రెస్పాన్ యాక్షన్ ప్లాన్ మూడు, నాల్గో దశలను ప్రభుత్వం అమలు చేస్తున్నది. చేసిన ఓవరేజ్ వాహనాల్లో పదేళ్లకుపైగా 260 డీజిల్ ఫోర్ వీలర్లు ఉన్నాయని ఢిల్లీ రవాణా శాఖ పేర్కొంది. 15 ఏళ్లు పైబడిన 1,156 పెట్రోల్ ద్విచక్ర వాహనాలు, 818 పెట్రోల్ త్రీవీలర్స్, ఫోర్ వీలర్స్ సీజ్ చేసినట్లు చెప్పింది. ఈ డ్రైవ్ డిసెంబర్ వరకు కొనసాగుతుందని.. పర్యావరణ నిబంధనలను అమలు చేయడానికి, వాహనాల నుంచి వెలువడే ఉద్గారాలను తగ్గించే ప్రయత్నంలో భాగమని ఢిల్లీ రవాణా శాఖ పేర్కొంది. ఓవరేజ్ వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ఢిల్లీ రవాణాశాఖ పోర్టల్‌ని ప్రారంభించింది.
స్వాధీనం చేసుకున్న వాహనాలను స్క్రాప్ చేయడం, వెనక్కి తీసుకోవడం, విక్రయించడం సులభతరం చేయడం.. స్క్రాపింగ్ ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి, వాహన యజమానులకు అలాంటి వాహనాల నిర్వహణ కోసం స్పష్టమైన స్టాండర్డ్ ఆపరేటింగ్ విధానాన్ని (SOP) అందించేందుకు ప్లాట్‌ఫారమ్ ప్రారంభించారు. ఇటీవలి ఢిల్లీ హైకోర్టు ఆదేశాల ప్రకారం.. వాహనాలను నిర్వహించేందుకు 2024 మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని ఢిల్లీ రవాణా శాఖ రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీస్ (RVSFs)కి ఆదేశాలు జారీ చేసింది. ఆర్డర్‌ను పాటించకపోతే ప్రోగ్రామ్ నుంచి మినహాయించబడవచ్చని పేర్కొంది. ఢిల్లీలో పది సంవత్సరాల కంటే పాత డీజిల్ వాహనాలు, 15 సంవత్సరాల కంటే పాత పెట్రోల్ వాహనాలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాజధానిలో ఓవరేజ్ వాహనాలపై డ్రైవర్ నిర్వహిస్తూ వస్తున్నారు. 15 సంవత్సరాల కంటే పాత వాహనాలను బహిరంగ ప్రదేశాల్లో పార్కింగ్ చేయడాన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) సైతం నిషేధించింది. ఇప్పటి వరకు ఢిల్లీ రవాణాశాఖ 55 లక్షలకుపైగా ఓవరేజ్ వాహనాల రిజిస్ట్రేషన్ రద్దు చేసింది.