ప్రధాని మన్ కీ బాత్‌పై నెటిజన్ల సెటైర్లు

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ 'మన్ కీ బాత్' కార్యక్రమంపై నెటిజన్లు సెటైర్లతో విరుచుకుపడ్డారు. ఒకవైపు యూట్యూబ్‌లో లైక్‌ల కంటే డిస్‌లైక్‌లు ఎక్కువగా వస్తుండగానే.. మరోవైపు ఇతర సామాజిక మాధ్యామాల్లో నెటిజన్లు విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి దేశవ్యాప్తంగా మంచి ఆదరణే లభించింది. అయితే ఈ ఏడాది ఆగస్టులో మొదటిసారి మన్ కీ బాత్‌పై తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తెంది.
ఆగస్టులో బీజేపీ అధికారిక యూట్యూబ్ ఛానల్, ప్రధాని మోదీ అధికారిక యూట్యూబ్ ఛానల్లో మన్ కీ బాత్ పై నెటిజన్లు డిస్‌లైక్‌లతో విరుచుకుపడ్డారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో మరోసారి మోదీ మన్ కీ బాత్‌పై నెటిజెన్లు తమ వ్యతిరేకత వ్యక్తపర్చారు. యూట్యూబ్ ఛానల్లలో డిస్‌లైక్‌ల పరంపర కొనసాగింది. లైక్‌ల కంటే ఎక్కువ సంఖ్యలో డిస్‌లైక్‌లు వచ్చాయి.
ట్విట్టర్లో కూడా ప్రధానికి వ్యతిరేకంగా ట్వీట్ల వర్షం కురిసింది. 'మోదీ బక్వాస్ బంద్ కరో' (మోదీ వ్యర్థ ప్రేలాపణ ఆపండి) అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. 'మోదీజీ.. మన్ కీ బాత్ కాదు, నెల రోజులకు పైగా రైతులు చేస్తున్న నిరవధిక నిరసనపై మాట్లాడండి' అంటూ మరో నెటిజెన్ సూచించాడు. 'దేశ ప్రజలు చెప్పే విషయాన్ని ప్రధాని మోదీ వినరు, కానీ ఆయన మన్ కీ బాత్ మాత్రం అందరూ వినాలి' అంటూ మరో నెటిజన్ విమర్శించారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.