Crime news : కన్న తండ్రే మైనారిటీ కూడా తీరని కుమార్తె పాలిట కీచకుడయ్యాడు. నెలలుగా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెను గర్భవతిని చేశాడు. బిడ్డ పుట్టడంతో ఓ బ్యాగులో పెట్టి రైల్లో పడేశాడు. రైల్లో పసికందు సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని మొరాదాబాద్ (Moradabad) జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఆడబిడ్డను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే మైనర్ బాలికపై నెలల తరబడి అత్యాచారానికి పాల్పడ్డాడు. దాంతో ఆ బాలిక గర్భం దాల్చింది. అయినా విషయాన్ని బయటపెట్టకుండా కన్నతల్లి కూడా దాచిపెట్టింది. చివరికి ఎవరికీ తెలియకుండా డెలివరీ చేయించడం కోసం తల్లిదండ్రులిద్దరూ మరో దగ్గరి బంధువుతో కలిసి బాలికను తీసుకుని ఢిల్లీకి పయనమయ్యారు. రైలు వారణాసికి చేరుకోగానే టాయిలెట్స్‌లో బాలిక డెలివరీ అయ్యింది. మగబిడ్డకు జన్మనిచ్చింది.
దాంతో నిందితుడు పసికందును ఓ బ్యాగులో పెట్టి తీసుకెళ్లి మరో రైలు టాయిలెట్స్‌లో వదిలేసి వచ్చాడు. జూన్ 22న ఈ ఘటన చోటుచేసుకుంది. అనంతరం బాలిక పేరెంట్స్, బంధువు ఢిల్లీకి వెళ్లి బాలికకు చికిత్స చేయించి తీసుకొచ్చారు. అయితే రైలు టాయిలెట్స్‌లో పసికందు ఉందని సమాచారం అందుకున్న మొరాబాద్ జంక్షన్ పోలీసులు.. ఘటన ప్రాంతానికి వెళ్లి పసికందును ఆస్పత్రిలో చేర్పించారు.
ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బ్యాగులో లభించిన సిమ్ కార్డు ఆధారంగా నిందితుడిని గుర్తించారు. పసిబిడ్డను వదిలించుకోవాలనే తొందరలో నిందితుడు బ్యాగులో సిమ్‌కార్డును గమనించకుండా చిన్నారిని అందులో పెట్టి పడేశాడు. సిమ్ కార్డు ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులకు అది నిందితుడితోపాటు ఢిల్లీకి వెళ్లిన సమీప బంధువుదని తెలిసింది. అతడిని విచారించగా విషయం పూర్తిగా బయటపెట్టాడు.
ఆ తర్వాత బాధితురాలిని విచారించగా జరిగిన దారుణం గురించి చెప్పింది. దాంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.