న్యూఢిల్లీ, జూలై 20: ఫ్యాక్ట్-చెకర్, ఆల్ట్‌న్యూస్ సహవ్యవస్థాపకుడు మహమ్మద్ జుబేర్ 24 రోజుల అనంతరం తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. అరెస్టుల నుంచి ఆయనకు విముక్తి కలిగిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆయన్ని అధికారులు బుధవారం రాత్రి విడుదల చేశారు. జుబేర్ బెయిల్‌కు సంబంధించి అంతకుముందు సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. విచారించిన కోర్టు.. యూపీలో దాఖలైన అన్ని ఎఫ్ఐఆర్లలో జుబేర్‌కు బెయిలు మంజూరు చేసింది.
యూపీ పోలీసులు ఈ కేసులపై వేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను రద్దు చేసింది. పోలీసు కస్టడీలో ఉన్న జుబేర్‌ను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. నిందాపూర్వకంగా, మతవిశ్వాసాలు గాయపడేలా ట్వీట్లు పెట్టాడంటూ జుబేర్‌పై యూపీలో ఆరు ఎఫ్ఐఆర్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇదే వ్యవహారానికి సంబంధించి ఢిల్లీ పోలీసుల ఎఫ్ఐఆర్పై స్థానిక న్యాయస్థానం బెయిలు ఇచ్చిన తర్వాత ఆయనను నిరంతరంగా కస్టడీలో ఉంచడం న్యాయం కాదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.
ఇదే అంశంపై భవిష్యత్తులో మరేదైనా ఎఫ్ఐఆర్ నమోదైనా జుబేర్‌ను బెయిలుపై విడుదల చేయాలని స్పష్టం చేసింది. ఢిల్లీ పాటియాలా హౌజ్ కోర్టులో రూ.20 వేల పూచీకత్తుతో చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేటు ద్వారా బెయిల్ పొందాలని న్యాయమూర్తులు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఏఎస్ బోపన్నతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. దీనిద్వారా జుబేర్ యూపీలో దాఖలైన అన్ని కేసుల్లో బెయిలు పొందినట్టుగా భావించాలని తెలిపింది.
అంతేకాకుండా యూపీలో దాఖలైన అన్ని ఎఫ్ఐఆర్లను ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లతో కలిపేయాలని ఆదేశించింది. యూపీ పోలీసులు వేసిన సిట్‌ను రద్దు చేయాలని తీర్పు చెప్పింది. ఢిల్లీ, యూపీ ఎఫ్ఐఆర్లు అన్నిటిని రద్దు చేయాల్సిందిగా జుబేర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించవచ్చని సూచించింది. అరెస్టు చేసే అధికారాన్ని& తక్కువ సందర్భాల్లో అరెస్టు చేసే అధికారం నుంచి వేరు చేసి చూడాలని పోలీసులకు సూచించింది. మొత్తంగా జుబేర్ ట్వీట్ల వ్యవహారాన్ని, ఆయన సంస్థకు అందుతున్న నిధుల గురించి ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, ఢిల్లీ కోర్టు ఈ కేసుపై ఇదివరకే బెయిలు మంజూరు చేసిందని ధర్మాసనం గుర్తు చేసింది.
ఈ నేపథ్యంలో అయనను నిరంతరంగా కస్టడీలో ఉంచడం న్యాయం కాదని నొక్కిచెప్పింది. ఎక్కడికక్కడ విడివిడిగా విడతలవారీగా దర్యాప్తు చేయడం కన్నా అన్ని ఎఫ్ఐఆర్లపై ఒకే విభాగం దర్యాప్తు చేయడం న్యాయమని స్పష్టం చేసింది. యూపీలో దాఖలైన ఎఫ్ఐఆర్లలోని అంశాలు, ఢిల్లీ పోలీసుల దర్యాప్తులో ఉన్న అంశాలు ఒకే తరహాకు చెందుతాయని తెలిపింది.
వాదించవద్దని లాయర్‌కు చెప్తామా?
జుబేర్ ఇకముందు ట్వీట్ చేయకుండా నిరోధించాలని చేసిన విజ్ఞప్తిని ధర్మాసనం తిరస్కరించింది. ఒక న్యాయవాదిని వాదించవద్దని చెప్పగలమా? అని ప్రశ్నించింది. ఒక జర్నలిస్టును ట్వీట్లు చేయొద్దని, వార్తలు రాయొద్దని చెప్పడం ఎలా సాధ్యమవుతుంది? అని పేర్కొన్నది. ఒకవేళ ఆయన తన ట్వీట్ల ద్వారా ఏదైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చని చెప్పింది. సుమారు రెండు గంటల వాదోపవాదాల అనంతరం ధర్మాసనం సుదీర్ఘమైన ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీలో ఎఫ్ఐఆర్ దర్యాప్తు సాగుతుండగానే యూపీలో ఏడు ఎఫ్ఐఆర్లు దాఖలయ్యాయి. ఇవన్నీ ఒక విషవలయం వంటివని రెండు రోజుల క్రితం జరిగిన విచారణ సందర్భంగా ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇదంతా నిరంతరంగా జుబేర్‌ను కస్టడీలో ఉంచే పన్నాగమన్నది.