న్యూఢిల్లీ, జూన్ 4: ‘అబ్కీ బార్ చార్సౌ పార్’ నినాదం ఫలించలేదు. రామమందిర నిర్మాణం ఓట్లు కురిపించలేదు. మతపరమైన అంశాలు ప్రభావం చూపలేదు. భావోద్వేగ ప్రసంగాలను జనం నమ్మలేదు. ఆయువుపట్టు లాంటి హిందీ బెల్ట్ హ్యాండ్ ఇచ్చింది. ఫలితం.. బీజేపీకి గట్టి షాక్ తగిలింది. ఒంటరిగా 370 స్థానాలు సాధిస్తామన్న బీజేపీ 240 దగ్గరే నిలిచిపోయింది. 400కు పైగా గెలుస్తామన్న ఎన్డీయే కూటమి 290 సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన బొటాబొటి మెజారిటీని మాత్రమే దక్కించుకుంది. పదేండ్ల బీజేపీ పాలనపై జనంలో ఉన్న అసంతృప్తి ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. ఎక్కడైతే బీజేపీకి ఎదురులేదని అనుకున్నారో అక్కడే వెనుకబడింది. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ అయితే ఎన్డీయేకు దక్కింది కానీ ప్రాంతీయ పార్టీలపై ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడింది.

బీజేపీకి దక్కని మ్యాజిక్ ఫిగర్ గత రెండుసార్లు ఎన్డీయే కూటమిగా బీజేపీ అధికారం చేపట్టినప్పటికీ ఆ పార్టీకి సొంతంగా మ్యాజిక్ ఫిగర్ దక్కింది. 2014లో 282 స్థానాలను, 2019లో 303 స్థానాలను దక్కించుకున్న బీజేపీ ఈసారి భారీగా సీట్లను కోల్పోయింది. 240 సీట్లకే ఆ పార్టీ పరిమితమైంది. బీజేపీ భారీ విజయం సాధిస్తుందనుకున్న ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా లాంటి రాష్ర్టాల్లో ఆ పార్టీకి మింగుడు పడని ఫలితాలు వచ్చాయి. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ.. బీజేపీని గట్టి దెబ్బ కొట్టాయి. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఆదుకోకపోతే బీజేపీ ఈసారి అధికారం కోల్పోయే పరిస్థితి వచ్చేది. బీజేపీని రెండుసార్లు కేంద్రంలో అధికారంలోకి తెచ్చిన మోదీ వేవ్‌కు కూడా ఇక పుల్‌స్టాప్ పడ్డట్టే అయ్యింది.

ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ ఎన్డీయేకు ఇండియా కూటమి గట్టి పోటీ ఇచ్చింది. 2014లో 44, 2019లో 52 స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో 99 స్థానాలను దక్కించుకుంది. గత రెండు ఎన్నికల్లో 5 సీట్లే గెలుచుకున్న సమాజ్‌వాదీ పార్టీ ఈసారి 37 సీట్లకు ఎగబాకింది. 29 స్థానాలతో తృణమూల్ కాంగ్రెస్, 22 స్థానాలతో డీఎంకే కూడా మంచి ఫలితాలు సాధించడంతో ఇండియా కూటమి ఎన్డీయేకు గట్టి పోటీ ఇచ్చింది. ఒక దశలో బీజేపీ అధికారంలోకి రాదేమోననే భావనను కల్పించింది.
ఉత్తరాదిలో బీజేపీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయని, హిందీ రాష్ర్టాల్లో ఆ పార్టీకి ఎదురులేదని పదేండ్లుగా ఉన్న భావన ఈ ఎన్నికలతో తేలిపోయింది. పెరుగుతున్న నిత్యావసరాల ధరలు, నిరుద్యోగం వంటి అంశాల ప్రభావం సైలెంట్ వేవ్‌లా పని చేసింది. జనంలో ఉన్న ఈ అసంతృప్తి ఎగ్జిట్ పోల్స్‌లో కనిపించకపోయినా ఈవీఎంలలో స్పష్టమైంది. బయటకు పెద్దగా వ్యతిరేకత కనిపించకపోయినా జనం పోలింగ్ బూత్‌లో మాత్రం ప్రభుత్వ వ్యతిరేకతను దాచుకోలేదు. ఇది బీజేపీని ఓడించే స్థాయిలో లేకపోయినా ఓటమికి చేరువ చేసే స్థాయిలో మాత్రం కనిపించింది.