miya muslims| గువాహటి: అస్సాంలో కూరగాయల ధరలు పెరగడానికి మియా ముస్లిం (తూర్పు బెంగాల్ నుంచి వలస వచ్చిన ముస్లింలు) కమ్యూనిటీనే కారణమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఆరోపించారు. గ్రామాల్లో కూరగాయల ధరలు తక్కువగానే ఉన్నాయని, వాటిని పట్టణాలకు తీసుకొచ్చేసరికి ధరలు పెరిగాయని చెప్పారు. వ్యాపారులంతా ధరలు పెంచుతున్నారని, అందులో ఎక్కువగా మియా ముస్లింలే ఉన్నారని పేర్కొన్నారు.
మియా వర్గం వారు స్థానిక కూరగాయల మార్కెట్లను నియంత్రణలోకి తెచ్చుకున్నారని, అస్సాం ప్రజల నుంచి వారు అధిక ధరలు వసూలు చేస్తున్నారని హిమంత ఆరోపించారు. ఒకవేళ అస్సాం యువత కూరగాయలు అమ్మితే, వారు తోటి అస్సాం ప్రజలకు తక్కువ రేట్లకే విక్రయిస్తారని పేర్కొన్నారు. అస్సాం యువత ముందుకు వస్తే, మియా ముస్లిం వ్యాపారాలను నగరం నుంచి తరిమేస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అస్సాంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే.