Vikram Misri | పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) నేపథ్యంలో గత కొన్ని రోజులుగా భారత్-పాకిస్థాన్ (India-Pakistan) మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన తరుణంలో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ (ceasefire) ఒప్పందం కుదిరింది. ఈ విషయాన్ని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ (Vikram Misri) ప్రకటించారు. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినట్లు వెల్లడించారు. పాకిస్థాన్ డీజీఎంవో, భారత డీజీఎంవో మధ్య ఫోన్లో చర్చలు జరిగాయని, రెండు దేశాలు కాల్పుల విరమణను అంగీకరించాయని మిస్రీ వెల్లడించారు. ఈ నెల 12న సాయంత్రం 5 గంటలకు ఇరుదేశాల డీజీఎంవోలు మళ్లీ చర్చలు జరుపుతారని చెప్పారు.
అయితే, ఈ ప్రకటన తర్వాత మిస్రీపై నెట్టింట ట్రోల్స్ మొదలయ్యాయి. ఆయనతోపాటు, ఆయన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకొని కొందరు తీవ్రంగా దూషించడం మొదలు పెట్టారు. ‘ద్రోహి’, ‘గద్దర్’, ‘దేశద్రోహి’ వంటి పదాలతో తీవ్రంగా దూషించారు. మరికొందరు ఆయన కుమార్తెల పౌరసత్వాన్ని కూడా ప్రశ్నిస్తూ పోస్టులు పెట్టారు. దీంతో ఆయన తన సోషల్ మీడియా ఖాతాలను లాక్ చేసుకున్నారు.
ఈ ఘటనపై పలువురు రాజకీయ నాయకులు, మాజీ దౌత్యవేత్తలు తీవ్రంగా స్పందించారు. ఈ విషయంలో ఆయనకు అండగా నిలిచారు. ప్రభుత్వ నిర్ణయాలను వెల్లడించినందుకు ఒక అధికారిని, ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ వంటి నేతలు మిస్రీకి మద్దతుగా నిలిచారు.
Also Read..
Indian Army | పాక్తో కాల్పుల విరమణ ఒప్పందం.. సరిహద్దుల్లో పరిస్థితిపై భారత సైన్యం కీలక ప్రకటన..!