Brahmos Missile |న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారంగా చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’లో ఉగ్రవాద స్థావరాలపై బ్రహ్మోస్ సూపర్‌సానిక్ క్రూయిజ్ మిసైల్‌ను ప్రయోగించినట్లు కనిపిస్తున్నది. రాజస్థాన్‌లోని బికనీర్ సమీపంలో ఈ క్షిపణికి సంబంధించిన మిసైల్ బూస్టర్, నోస్ క్యాప్ ఉన్నట్లు కొందరు గుర్తించారు. ఈ మిసైల్‌ను ప్రయోగించిన కాసేపటి తర్వాత కొన్ని విడి భాగాలను ఇండో-పాక్ సరిహద్దుల్లోని మారుమూల ప్రాంతంలో గుర్తించారు. పాకిస్థాన్‌లోని బహావల్పూర్లో ఉన్న జైషే మహమ్మద్ ఉగ్రవాద నెట్వర్క్ హెడ్‌క్వార్టర్‌పై దీనిని ప్రయోగించినట్లు భావిస్తున్నారు. అయితే, ఈ విషయాన్ని భారత ప్రభుత్వం ధ్రువీకరించలేదు.
అసలు ఏమిటి ఈ బ్రహ్మోస్?
బ్రహ్మోస్ అనేది లాంగ్ రేంజ్ సూపర్‌సానిక్ క్రూయిజ్ మిసైల్. ఇది అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించగలదు. ఇది ‘ఫైర్ అండ్ ఫర్గెట్ సూత్రం’ ఆధారంగా పని చేస్తుంది. లక్ష్యాన్ని చేరుకునే మార్గంలో రకరకాలుగా ఇది ప్రయాణిస్తుంది. కైనెటిక్ ఎనర్జీ (చలన శక్తి) భారీగా ఉండటం వల్ల లక్ష్యాన్ని విధ్వంసం చేసే సత్తా బ్రహ్మోస్ క్షిపణికి అత్యధికంగా ఉంటుంది. బ్రహ్మోస్ క్షిపణిని స్టెల్త్ టెక్నాలజీతో తయారు చేశారు. అంటే, దీనిని శత్రు రాడార్లు, ఇన్ఫ్రారెడ్ సెన్సర్లు, సోనార్ వంటి వ్యవస్థలు గుర్తించడం కష్టం. దీంతోపాటు అడ్వాన్స్డ్ గైడెన్స్ సిస్టమ్, దానిలోనే సాఫ్ట్వేర్ కూడా ఉంటుంది. అత్యంత కచ్చితత్వంతో, ప్రతికూల పరిస్థితుల్లో నిలదొక్కుకుని పని చేసే విధంగా ఈ క్షిపణిని రూపొందించారు. 290 కి.మీ. పరిధిలోని లక్ష్యాన్ని ఇది ఛేదించగలదు. ప్రయాణ కాలంలో మొదటి నుంచి చివరి వరకు సూపర్‌సానిక్ వేగాన్ని కొనసాగించగలదు. ప్రయాణ కాలం తక్కువగా ఉండేలా, లక్ష్యాన్ని కచ్చితత్వంతో ఛేదించేలా, ప్రస్తుత రక్షణ వ్యవస్థలు అడ్డుకునే అవకాశాలు అతి కనిష్టంగా ఉండేలా తయారు చేశారు.
బ్రహ్మోస్ ప్రత్యేకతలు
రేంజ్ : 450 కి.మీ.కుపైగా (800 కి.మీ. వరకు వేరియంట్స్‌ను పరీక్షించినట్లు వార్తలు వచ్చాయి)
వేగం: సూపర్‌సానిక్ (మాక్ 2.8-3.0). ఫలితంగా దీనిని అడ్డుకోవడం చాలా కష్టం.
ప్రయోగ వేదిక: గగనతలం, భూతలం, సముద్రం, జలాంతర్గామి నుంచి ప్రయోగించవచ్చు. ఏఎల్సీఎం వెర్షన్‌ను ఎస్‌యూ-30ఎంకే నుంచి ప్రయోగించారు.
కచ్చితత్వం: అడ్వాన్స్డ్ గైడెన్స్, నావిగేషన్‌తో పిన్పాయింట్కు దగ్గరగా.
పేలోడ్: అత్యంత భారీగా పేలే వార్‌హెడ్ (200-300 కేజీలు). కఠినమైన లక్ష్యాలను ఛేదించడానికి ఇది ఉపయోగపడుతుంది.
ప్రస్తుత అత్యాధునిక సబ్‌సానిక్ క్రూయిజ్ మిసైల్స్‌తో పోల్చినపుడు, బ్రహ్మోస్ ప్రత్యేకతలు :
వేగం 3 రెట్లు వేగం
ఫ్లైట్ రేంజ్ 2.5 నుంచి 3 రెట్లు
సీకర్ రేంజ్ 3-4 రెట్లు
కైనెటిక్ ఎనర్జీ 9 రెట్లు