Operation Sindoor | న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’పై ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూనే మోదీ పేరు ప్రస్తావించకుండా మౌనం పాటించడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైందని ‘ది టెలిగ్రాఫ్ ఆన్లైన్’కు రాసిన వ్యాసంలో జేపీ యాదవ్ పేర్కొన్నారు. పాకిస్థాన్‌ను ప్రోత్సహించిన ఉగ్రవాదులు, వారికి మద్దతునిచ్చే వ్యవస్థపై ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో చర్యలు తీసుకున్న ప్రభుత్వాన్ని ప్రశంసిస్తున్నామని, మన సైనిక బలగాలను అభినందిస్తున్నామంటూ భాగవత్, ఆరెస్సెస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే పేరున జారీ అయిన ప్రకటనను ప్రస్తావిస్తూ.. అందులో మోదీ పేరు లేకపోవడాన్ని వ్యాసకర్త ఎత్తి చూపారు. వ్యక్తులను నెత్తికెక్కించుకోకపోవడం సంఘ్‌కు అలవాటే అయినప్పటికీ మోదీ విషయంలో భాగవత్ మౌనం వారిద్దరి మధ్య కొనసాగుతున్న అధికార పోరును ప్రతిబింబిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఎడ ముఖం.. పెడ ముఖం
గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ దారుణంగా విఫలమైన తర్వాత భాగవత్, మోదీ ఎడ ముఖం, పెడ ముఖంలా ఉన్నారు. మోదీ అతి విశ్వాసాన్ని భాగవత్ దుయ్యబట్టారు. బీజేపీ తదుపరి అధ్యక్షుడి ఎన్నిక జాప్యానికి వీరిద్దరి మధ్య పోరే కారణమని వ్యాసకర్త అభిప్రాయపడ్డారు. పార్టీ అధ్యక్షుడి ఎంపికపై నెలకొన్న ప్రతిష్ఠంభన వారి అహంకారానికి తాజా ఉదాహరణ అని విమర్శించారు. మోదీకి, ఆయన నంబర్ 2 హోం మంత్రి అమిత్‌షాకు ‘రబ్బర్ స్టాంప్’లాగా విధేయతతో ఉండే పార్టీ చీఫ్‌ను ఇచ్చేందుకు ఆరెస్సెస్ చీఫ్ విముఖత చూపడం కూడా ఈ జాప్యానికి మరో కారణంగా పేర్కొన్నారు. చాలా కాలం క్రితమే జరగాల్సిన అధ్యక్షుడి నియామకం ఈ కారణంగానే ఆగిపోయిందన్నారు. అయితే, పాకిస్థాన్‌తో నెలకొన్న ఉద్రిక్తతలు కూడా బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక మరింత ఆలస్యం కావడానికి కారణం కావొచ్చని జేపీ యాదవ్ పేర్కొన్నారు.
మోదీ పేరు రాకుండా జాగ్రత్త
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవడంలో మోదీ ‘ధైర్యమైన, నిర్ణయాత్మక’ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ బీజేపీ, కాషాయ శ్రేణులు ‘ఆపరేషన్ సిందూర్’ను ఉదహరిస్తున్నాయి. ఆరెస్సెస్ ప్రకటన కూడా సైనిక చర్యను అభినందించింది. హిందూ పర్యాటకులపై జరిగిన దారుణ హత్యాకాండలో బాధితులైన కుటుంబాలకు, మొత్తం దేశానికి న్యాయం చేసేందుకు చేపట్టిన ఈ చర్య దేశ ఆత్మగౌరవాన్ని, నైతికతను పెంచిందన్న ఆరెస్సెస్.. ఆ ప్రకటనలో మోదీ పేరు రాకుండా జాగ్రత్త పడింది. ‘పాకిస్థాన్‌లోని ఉగ్రవాదులు, వారి మౌలిక సదుపాయాలు, మద్దతుదారులపై సైనిక చర్య తీసుకోవడం దేశ భద్రతకు అనివార్యమైనదే అని మేము పూర్తిగా ఏకీభవిస్తున్నాం. ఈ జాతీయ సంక్షోభ సమయంలో దేశం మొత్తం కేంద్ర ప్రభుత్వం, సైనిక దళాల వెంట నిలుస్తుంది’ అని ఆరెస్సెస్ ఆ ప్రకటనలో పేర్కొన్నది. ప్రతి పౌరుడు దేశభక్తిని చాటుకోవాలని విజ్ఞప్తి చేసింది. సామాజిక ఐక్యత, సామరస్యాన్ని దెబ్బతీసే జాతీయ వ్యతిరేక శక్తుల కుట్రల పట్ల జాగ్రత్తగా ఉండాలని పౌరులను కోరింది.