భోపాల్: ప్రభుత్వ ఆసుప్రతిలో తల్లికి తోడుగా ఉన్న బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన కలకలం రేపింది. ఆ తర్వాత బాధిత బాలిక అదృశ్యమైంది. (Minor Missing After Gang Rape) బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. సిద్ధి జిల్లాలోని రాంపూర్ నైకిన్కు చెందిన మహిళ రేవాలోని సంజయ్ గాంధీ ఆసుపత్రి ఈఎన్టీ విభాగంలో అడ్మిట్ అయ్యింది. అయితే తల్లికి తోడుగా ఉన్న మైనర్ బాలికపై జూన్ 9న సోమవారం తెల్లవారుజామున సామూహిక అత్యాచారం జరిగింది. లైంగిక దాడి తర్వాత బాధిత యువతిని నిందితులు స్ట్రెచర్‌పై ఆసుపత్రికి తీసుకువచ్చారు. అక్కడ వదిలేసి పారిపోయారు. సీసీటీవీలో ఇది రికార్డ్ అయ్యింది.
కాగా, బాధిత బాలిక, ఆమె కుటుంబం పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. ఆసుపత్రి అధికారులు కూడా దీనిని కవర్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే మీడియా ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన కలకలం రేపింది. డిప్యూటీ సీఎం, ఆరోగ్య మంత్రి రాజేంద్ర శుక్లా నియోజక వర్గంలో ఇది జరుగడం రాజకీయ రచ్చకు దారి తీసింది. దీంతో చివరకు ప్రభుత్వ ఆసుపత్రి అధికారులు ఈ సంఘటనపై పోలీసులు, కలెక్టర్‌కు సమాచారం ఇచ్చారు.
మరోవైపు ఈ సంఘటన వెలుగులోకి వచ్చినప్పటి నుంచి బాధిత బాలిక కనిపించడం లేదు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని జిల్లా ఎస్పీ తెలిపారు. బాధితులు ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే నేరస్తులను శిక్షించి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.
కాగా, ఈ సంఘటనపై రిపోర్ట్ చేయడంలో నిర్లక్ష్యం వహించిన డ్యూటీ డాక్టర్‌కు షోకాజ్ నోటీస్ జారీ చేస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి ఇద్దరు వార్డ్ బాయ్స్, సెక్యూరిటీ గార్డును పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారని వెల్లడించారు.
Also Read: