న్యూఢిల్లీ: ప్రతిపక్ష నేతలను కేంద్ర మంత్రులు బెదిరిస్తున్నారని, అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని లోక్‌సభలో కాంగ్రెస్ డిప్యూటీ నేత గౌరవ్ గొగోయ్ (Gaurav Gogoi) ఆరోపించారు. ఈ మేరకు స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. పార్లమెంటరీ ప్రవర్తన ప్రమాణాలు దిగజారడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జూలై 26న హర్యానా మాజీ సీఎం భూపీందర్ సింగ్ హుడాపై, జూలై 25న రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీపై కేంద్ర మంత్రులు రాజీవ్ రంజన్ సింగ్, రవ్నీత్ సింగ్ బిట్టు బెదిరింపు, అన్‌పార్లమెంటరీ భాషను ఉపయోగించారని గౌరవ్ గొగోయ్ ఆరోపించారు. అలాగే బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే కూడా సభలో మతపరమైన భాషను ఉపయోగించారని విమర్శించారు.
కాగా, లోక్‌సభలో నీచమైన ప్రకటనలు చేస్తున్న వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని గౌరవ్ గొగోయ్ డిమాండ్ చేశారు. ఈ అంశంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ స్పీకర్ ఓం బిర్లాకు శనివారం లేఖ రాశారు. ‘లోక్‌సభలో పార్లమెంటరీ ప్రవర్తనా ప్రమాణాలు దిగజారడం పట్ల తీవ్ర ఆందోళన చెందిన నేను మీకు ఈ లేఖ రాస్తున్నా. ప్రస్తుతం జరుగుతున్న వర్షాకాల సమావేశాల్లో అనేక ఉదంతాలు రుజువు చేస్తున్నాయి. తరచుగా ప్రతిపక్ష సభ్యులపై ప్రభుత్వ మంత్రులు అసాంఘిక, అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారు. బెదిరింపులకు పాల్పడుతున్నారు’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.