న్యూఢిల్లీ: ముక్కు ద్వారా ఇచ్చే ‘ఇన్కోవాక్’ కొవిడ్ వ్యాక్సిన్‌ను బూస్టర్ డోస్‌గా వినియోగించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. 18 ఏండ్లకు పైబడిన వారికి ఈ వ్యాక్సిన్ ఇవ్వొచ్చని తెలిపింది. ఈ వ్యాక్సిన్‌ను కొవిన్ పోర్టల్లోనూ పొందుపర్చనున్నారు. మొదటి రెండు డోసులు కొవిషీల్డ్ లేదా కొవాగ్జిన్ వేసుకున్న వారు ప్రికాషనరీ డోసుగా ఈవ్యాక్సిన్ను వేసుకోవచ్చు.
సూది అవసరం లేకుండా ముక్కు ద్వారా ఈ వ్యాక్సిన్‌ను ఇస్తారు. నవంబరులోనే ఈ వ్యాక్సిన్‌కు అత్యవసర వినియోగానికి డీజీసీఐ అనుమతి లభించింది. ప్రస్తుతం చైనా సహా పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రికాషనరీ డోసుగా వినియోగించేందుకు కేంద్రం అనుమతించింది. వాషింగ్టన్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్సంస్థ ఈ వ్యా క్సిన్‌ను అభివృద్ధి చేసింది. మరోవైపు పండుగల వేళ రద్దీ ఉండకుండా చూడాలని, ప్రజలంతా మాస్కులు ధరించేలా చూడాలని రాష్ర్టాలకు కేంద్రం సూచించింది.
భారత్ బయోటెక్‌కు అభినందనలు
కొవిడ్-19ను ఎదుర్కొవడంలో హైదరాబాద్ ఎప్పుడూ ముందుంటున్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రపంచంలోనే తొలిసారి కొవిడ్‌కు ముక్కులో వేసుకొనే ఇంట్రానాసల్ వ్యాక్సిన్ తయారు చేసిన హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్‌కు కేటీఆర్ అభినందనలు తెలిపారు. ముక్కు టీకాకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సందర్భంగా భారత్ బయోటెక్ యజమానులు కృష్ణా ఎల్లా, సుచిత్ర ఎల్లాకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.