Rains | హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ) : వేసవి సమీపిస్తున్న తరుణంలో దేశంలోని కొన్ని రాష్ర్టాలకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. బంగాళాఖాతంలో ఉపరితలంలో ఆవర్తనం ఏర్పడి ఈశాన్య దిశగా కొనసాగుతున్నదని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. బంగాళాఖాతం మీదుగా తుఫాన్ గాలులు వీయనున్నాయని, దీంతో రానున్న వారం రోజులు ఉత్తరాదిలోని కొన్ని ప్రాంతాలు, ఈశాన్య రాష్ర్టాల్లో భారీ వర్షాలు పడనున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.
పర్వత ప్రాంతాల్లో హిమపాతం భారీగా కురవనున్నదని, బంగాళాఖాతంలో తుఫాన్ గాలుల కారణంగా అసోం, నాగాలాండ్, మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, పశ్చిమబెంగాల్, సిక్కింతోపాటు ఉత్తరాంచల్, జార్కండ్లో భారీ వర్షాలు పడనున్నట్టు హెచ్చరించింది. ఫిబ్రవరి 21 వరకు ఈశాన్య ప్రాంతంలో 1.5 కిలోమీటర్ల ఎత్తులో గాలులు వీచే అవకాశముందని, దీంతో అక్కడ భారీ వర్షాలు పడవచ్చని అంచనా వేసింది. ఫిబ్రవరి 19న అసోం, మేఘాలయలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. హిమాచల్‌ప్రదేశ్‌లో తేలికపాటి వర్షం, భారీగా మంచు పడవచ్చని చెప్పింది. 24 తర్వాత ఉత్తరాదిలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, దక్షిణాది రాష్ర్టాల్లో ఇప్పటికే పెరిగాయని వివరించింది.
పెరుగుతున్న ఎండల తీవ్రత..
తెలంగాణలో వారం రోజులుగా ఎండల తీవ్రత పెరిగింది. రాబోయే 3 రోజుల్లో సాధారణ పగటి ఉష్ణోగ్రతలు 1-2 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు తక్కువగా ఉండే అవకాశం ఉందని, రాష్ట్రవ్యాప్తంగా సగటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 35.4 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 19.8 డిగ్రీలుగా నమోదైనట్టు ప్రకటించింది. మంగళవారం నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 36.3 డిగ్రీలు, మహబూబ్‌నగర్‌లో 36, ఆదిలాబాద్‌లో 35.8, హైదరాబాద్‌లో 35.7, మెదక్, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల్లో 35.4 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వివరించింది.