Parliament Security Breach | న్యూఢిల్లీ, డిసెంబర్ 15: భద్రతా వైఫల్యంపై పార్లమెంటు శుక్రవారం కూడా అట్టుడికింది. పార్లమెంటులోకి దుండగుల చొరబాటుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలో ప్రకటన చేయాలన్న డిమాండ్‌తో ఉభయ సభలను ప్రతిపక్షాలు స్తంభింపజేశాయి. విపక్ష సభ్యులు పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ సభా కార్యకలాపాలను అడ్డుకొన్నారు. అమిత్ షా ప్రకటన చేయాల్సిందేనని పట్టుబట్టారు. దుండగులకు పాస్‌లు ఇచ్చిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహాపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో శుక్రవారం సభలు ప్రారంభమైన నిమిషాల్లోనే మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాకపోవటంతో లోక్‌సభ, రాజ్యసభను సోమవారానికి వాయిదా వేశారు.
భద్రతా వైఫల్యంపై సభలో చర్చించేందుకు సిద్ధమని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ తెలిపారు. విపక్షాలు నిరసనను విరమించి చర్చలో పాల్గొనాలని కోరారు. దుండగుల చొరబాటుపై ఉన్నత స్థాయి దర్యాప్తు ప్రారంభమైందని తెలిపారు. ఈ ప్రతిపాదనను విపక్షాలు తిరస్కరించాయి. హోం మంత్రి సభలో ప్రకటన చేయాల్సిందేనని పట్టుబట్టాయి. గురువారం 14 మంది విపక్ష ఎంపీలను చట్ట వ్యతిరేకంగా సస్పెండ్ చేశారని రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే శుక్రవారం విమర్శలు గుప్పించారు. టీవీ చానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్న హోంమంత్రి.. ఇంతటి కీలక అంశంపై పార్లమెంటులో ప్రకటన చేసేందుకు ఎందుకు ముందుకు రావటం లేదని ప్రశ్నించారు. ‘గురువారం సాయంత్రం అమిత్ షా ఓ టీవీ చానల్‌తో మాట్లాడారు.. కానీ సభలో ప్రకటన చేసేందుకు మాత్రం ముందుకు రావటం లేదు. ఇది ఆయన అహంకారానికి పరాకాష్ట’ అని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ మండిపడ్డారు.
పార్లమెంటులోకి చొరబాటు కుట్రలో కీలక సూత్రధారిగా వ్యవహరిస్తున్న లలిత్ ఝాను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను ఢిల్లీ కోర్టులో హాజరుపర్చగా కోర్టు 7 రోజుల పోలీస్ కస్టడీ విధించింది. అనంతరం తమ విచారణలో లలిత్ అనేక విషయాలు వెల్లడించినట్టు పోలీసులు తెలిపారు. పార్లమెంటులో నిరసన తెలిపేందుకు రెండురకాల ప్రణాళికలు వేసుకొన్నారని పేర్కొన్నారు. ప్లాన్ ఏ ప్రకారం నీలం, అమోల్ పార్లమెంటు లోపలికి ప్రవేశించి మీడియా కెమెరాల ముందు నినాదాలు చేస్తూ హల్చల్ చేయాలి. అది విఫలమైతే ప్లాన్ బీ ప్రకారం మహేశ్, కైలాశ్ మరో మార్గం గుండా పార్లమెంటులోకి ప్రవేశించి అనుకున్న పని పూర్తి చేయాలి అని నిర్ణయించుకొన్నారు. కానీ, మహేశ్, కైలాశ్ అనుకున్న సమయానికి గురుగ్రామ్‌లోని విశాల్ శర్మ ఇంటికి చేరుకోలేకపోవటంతో ప్రణాళికలో మార్పులు చేశారు’ అని పోలీసులు వెల్లడించారు.