Mayawati | లక్నో : బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి కీలక నిర్ణయం తీసుకున్నారు. తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌కు మరోసారి కీలక బాధ్యతలు కట్టబెట్టారు. పార్టీ చీఫ్ నేషనల్ కోఆర్డినేటర్‌గా ఆకాశ్ ఆనంద్‌ను నియమిస్తూ మాయావతి నిర్ణయం తీసుకున్నారు.
ఢిల్లీ లోథిరోడ్‌లోని బీఎస్పీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ స్థాయి సమావేశం ఆదివారం జరిగింది. బీఎస్పీ కీలక నాయకులు, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇక యూపీకి చెందిన అన్ని జిల్లాల అధ్యక్షులు, కోఆర్డినేటర్లతో పాటు జాతీయ కోఆర్డినేటర్లు, జనరల్ సెక్రటరీలు, రాష్ట్రాల అధ్యక్షులు హాజరయ్యారు.
ఈ సమావేశంలో ఆకాష్ ఆనంద్‌కు పార్టీ చీఫ్ నేషనల్ కోఆర్డినేటర్‌గా మాయావతి బాధ్యతలు అప్పగించారు. ఈసారి పార్టీని, పార్టీ ఉద్యమాన్ని అత్యంత జాగరూకతతో, నిబద్ధతతో ఆయన ముందుకు తీసుకువెళ్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇక దేశంలోని ప్రధాన సమస్యలతో పాటు సంస్థాగత అంశాలపై చర్చించారు. నేషనల్ కోఆర్డినేటర్స్గా రామ్ జీ గౌతమ్, రణధీర్ బెనివాల్, రాజారామ్‌ను మాయావతి నియమించారు.
ఈ ఏడాది మార్చి 3వ తేదీన ఆకాశ్ ఆనంద్‌ను మాయావతి పార్టీ నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 13వ తేదీన ఆకాశ్ పార్టీకి బహిరంగ క్షమాపణ చెప్పిన తర్వాత ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీ నుంచి బహిష్కరణకు గురైన 40 రోజుల తర్వాత ఆకాశ్ మాట్లాడుతూ.. తన ఏకైక రాజకీయ గురువు మాయావతి మాత్రమే అని చెప్పి.. తన తప్పులకు క్షమాపణలు కోరాడు. పార్టీలో మళ్లీ పని చేసే అవకాశం ఇవ్వాలని ఆకాశ్ కోరారు.
18-05-2025-BSP PRESSNOTE-ALL INDIA MEETING pic.twitter.com/z0IF3crxN3
— Mayawati (@Mayawati) May 18, 2025