West Bengal : పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. టీఎంసీ గూండాలు తమను బెదిరిస్తున్నారంటూ సౌత్ 24 పరగణాస్ జిల్లాలోని ఫాల్టాలో స్థానికులు ఆందోళన బాటపట్టారు. అంతేకాదు, తమ ప్రాంతంలో రీపోలింగ్ నిర్వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే, కేంద్ర బలగాలైన సీఏపీఎఫ్‌ను మోహరించి, తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఫాల్టాలో స్థానికులు రోడ్లు, వీధుల్లోకి వచ్చి ఆందోళన నిర్వహిస్తున్నారు.
దీనిపై స్పందించిన స్థానిక అధికారులు భద్రతను పెంచారు. సీఆర్పీఎఫ్, ఆర్పీఎఫ్ దళాల్ని మోహరించారు. శాంతి భద్రతల్ని పర్యవేక్షించేందుకు అనేక చోట్ల సీఆర్పీఎఫ్ వాహనాలు కొలువుదీరాయి. టీఎంసీ నేతలు, గూండాల బెదిరింపుపై మహిళలు వీధుల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారు పొరపాటున గెలిస్తే తమ ఇండ్లను దహనంచేయడం ఖాయమని, రక్తపాతం తప్పదని ఒక మహిళ వ్యాఖ్యానించింది. టీఎంసీకి చెందిన ఇస్రాఫిల్ చౌకిదార్ తమను బెదిరిస్తున్నాడని, తాము టీఎంసీకి ఓటేసినప్పటికీ వేధింపులు తప్పడం లేదని మరో మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. టీఎంసీ చౌకిదార్ను అరెస్టు చేసి, తమకు రక్షణ కల్పించాలని పలువురు మహిళలు కోరారు.
మరో గ్రామంలో స్థానిక టీఎంసీ నేత బైకులపై వచ్చి తమను బెదిరించారని తెలిపారు. వాళ్లు తమ గ్రామంపై దాడి చేసి, హత్యలు చేసే అవకాశం కూడా ఉందని వారు అంటున్నారు. ఒక పక్క బెంగాల్లో భారీ స్థాయిలో కేంద్ర బలగాలు మోహరించినప్పటికీ అనేక చోట్ల హింస, ఆందోళనలు ఆగడం లేదు. పశ్చిమ బెంగాల్‌లోని ఒక స్ట్రాంగ్ రూమ్‌ను అనుమతి లేకుండా కొందరు తెరిచారని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ ఘటనలో ఆరుగురు అధికారుల్ని ఈసీ సస్పెండ్ చేసింది. మే 4, సోమవారం ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.