Maharashtra : మాతృభాష అమలు విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మహారాష్ట్రాలో రిక్షాలు, ట్యాక్సీలు నడిపై డ్రైవర్లకు మరాఠీ భాష రావాల్సిందే అంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఈ నిర్ణయం మాతృభాషను అమలు చేయాలనే ఆలోచనకన్నా.. ప్రయాణికులు పడుతున్న ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని తీసుకున్నట్లుగా కనిపిస్తోంది.
మహారాష్ట్రలో మే 1 నుంచి రిక్షాలు, ట్యాక్సీలు నడిపై డ్రైవర్లకు మరాఠీ భాషపై కనీస అవగాహన ఉండాలని రాష్ట్ర మంత్రి ప్రతాప్ సర్నాయక్ తెలిపారు. ఈ అంశంపై రాష్ట్రవ్యాప్త కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. రవాణా శాఖ దీనిపై స్పెషల్ డ్రైవ్ చేపడుతుందని, ఈ మేరకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. కనీస మరాఠీ భాష మాట్లాడటం, అర్థం చేసుకోవడం రాని డ్రైవర్ల లైసెన్సులు రద్దు చేస్తామని ఆయన హెచ్చరించారు. ‘‘మే 1న మహారాష్ట్ర దినోత్సవం. ఆ రోజు నుంచి రాష్ట్రంలో లైసెన్స్ కలిగిన డ్రైవర్లకు మరాఠీ తెలిసి ఉండాలి. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేపడతాం. 59 ప్రాంతీయ, ఉప ప్రాంతీయ కార్యాలయ పరిధిలో రవాణా శాఖ ఆధ్వర్యంలో డ్రైవర్లు టెస్టులు పాసవ్వాలి. మరాఠీ రాయడం, చదవడం వచ్చి ఉండాలి’’ అని మంత్రి ప్రతాప్ సర్నాయక్ అన్నారు.
డ్రైవర్లతో కమ్యూనికేషన్ సందర్భంగా ప్రయాణికుల నుంచి వచ్చిన వేలాది ఫిర్యాదుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా ముంబై మెట్రోపాలిటన్ పరిధిలో ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయన్నారు. ప్రాంతీయ భాష నేర్చుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఇతర ప్రాంతాల్లో పని చేస్తున్న వారు ఆ ప్రాంతపు భాష నేర్చుకోవాలని మంత్రి సూచించారు. ప్రతి ఒక్కరూ తమ మాతృభాషపై గర్వపడాలని అభిప్రాయపడ్డారు.