న్యూఢిల్లీ: ఒక వ్యక్తి రోడ్డుపై వెళ్తుండగా స్కూటీపై వచ్చిన ఇద్దరు అగంతకులు అతడి మొబైల్ ఫోన్ లాక్కెళ్లారు. (Man’s Phone Snatched) ఫిర్యాదుపై దర్యాప్తు చేసిన పోలీసులు ఆ వ్యక్తి భార్యే ఈ పని చేయించినట్లు తెలుసుకుని షాక్ అయ్యారు. మరో వ్యక్తితో ఆమెకు వివాహేతర సంబంధం నేపథ్యంలో ఈ సంఘటన జరిగినట్లు నిర్ధారించారు. జూన్ 19న దక్షిణ ఢిల్లీలోని ఓల్డ్ యూకే పెయింట్ ఫ్యాక్టరీ సమీపంలో స్కూటీపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఒక వ్యక్తి మొబైల్ ఫోన్ లాక్కొని పారిపోయారు. దీంతో ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కాగా, దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆ ప్రాంతంలోని 70 సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించారు. ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరా ద్వారా ఆ స్కూటీ నంబర్ తెలుసుకున్నారు. దర్యాగంజ్‌లో రెంట్‌కు తీసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. దీంతో ఆధార్‌కార్డు, మొబైల్ నంబర్ ఆధారంగా ఆ స్కూటీని అద్దెకు తీసుకున్న వ్యక్తిని గుర్తించారు. రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లా బలోత్రాకు చేరుకున్న ఢిల్లీ పోలీసులు నిందితుల్లో ఒకడైన అంకిత్ గెహ్లాట్‌ను అరెస్టు చేశారు.
మరోవైపు అంకిత్‌ను ప్రశ్నించగా ఆ వ్యక్తి భార్యనే అతడి మొబైల్ ఫోన్ చోరీ కోసం అతడ్ని హైర్ చేసిందని పోలీస్ అధికారి తెలిపారు. ఆమెకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నదని చెప్పారు. ఇది తెలుసుకున్న భర్త ఆమె మొబైల్లోని ఫొటోలను తన మొబైల్ ఫోన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లు వివరించారు. ఇది గుర్తించిన భార్య, మరో వ్యక్తితో తన సంబంధం గురించి కుటుంబానికి తెలుస్తుందని భయపడిందన్నారు.
కాగా, భర్త మొబైల్ ఫోన్ చోరీ చేయించి అందులో ఉన్న ఆ ఫొటోలు డిలీట్ చేయించేందుకు భార్య ప్లాన్ వేసిందని పోలీస్ అధికారి తెలిపారు. దీని కోసం అంకిత్‌ను ఆమె హైర్ చేసిందని చెప్పారు. భర్త దినచర్య, ఆఫీస్‌కు వెళ్లే సమయాలు, మార్గాల గురించి అతడికి సమాచారం ఇచ్చిందన్నారు. ఆ వ్యక్తి నుంచి లాక్కెళ్లిన మొబైల్ ఫోన్‌ను అంకిత్ నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. అతడితో పాటు ఫిర్యాదు చేసిన వ్యక్తి భార్యను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
Also Read:
3 Men Rape Woman | మహిళపై ముగ్గురు అత్యాచారం.. ఇంట్లోని ఫ్రిజ్, వాషింగ్ మెషిన్ చోరీ