Union Minister : హరియాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భంగపాటు తప్పదని కేంద్ర మంత్రి, హరియాణ మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ అన్నారు. కాంగ్రెస్‌తో పొత్తుకు ఏ పార్టీ ముందుకు రావడం లేదని చెప్పారు. రిజర్వేషన్లు, సిక్కులపై కాంగ్రెస్ నేతలు అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. హరియాణ సీఎం నయబ్ సింగ్ సైనీ నేతృత్వంలో రాష్ట్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిందని అన్నారు. హరియాణలోని ఝజర్‌లో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రిజర్వేషన్ల తొలగింపుపై కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ అమెరికాలో చేసిన వ్యాఖ్యలు గర్హనీయమని పేర్కొన్నారు. రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ఆలోచనలు బట్టబయలయ్యాయని అన్నారు. విదేశీ గడ్డపై రాహుల్ గాంధీ దేశాన్ని అవమానించేలా వ్యాఖ్యలు చేయడం ఆయనకు అలవాటుగా మారిందని మండిపడ్డారు.
మరోవైపు రెండ్రోజుల్లో ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేస్తానని అరవింద్ కేజ్రీవాల్ ప్రకటనపై ఖట్టర్ స్పందించారు. అవినీతి ఆరోపణల నుంచి బయటపడి స్వచ్ఛంగా ప్రజల ముందుకు రావాలని ఆయన కోరుకుంటున్నారని, కానీ కేజ్రీవాల్‌ను ప్రజలు ఆదరించరని అన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు అరవింద్ కేజ్రీవాల్‌కు ఓటు వేయరని స్పష్టం చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌ను ప్రజలు తిరస్కరిస్తారని ఆయన జోస్యం చెప్పారు.
Read More :