Mann Ki Baat : ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ప్రజలపై ప్రశంసలు కురిపించారు. తాజాగా తన 114వ మన్ కీ బాత్ ఎపిసోడ్లో ఆయన చాలా అంశాలను ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలను మెచ్చుకున్నారు. అనుకున్న లక్ష్యం కంటే ఎక్కువగా మొక్కలను నాటడం ద్వారా తెలంగాణ ప్రజలు కొత్త రికార్డు సృష్టించారని అన్నారు. తెలంగాణతోపాటు ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు కూడా రికార్డు సాధించాయని పేర్కొన్నారు.
ఇదంతా ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమంలో భాగంగా జరిగిందన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ జూన్‌లో ఈ పిలుపు ఇచ్చారు. ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటి, దానికి తల్లి పేరు పెట్టాలని సూచించారు. అలా ‘ఏక్ పేడ్ మా కే నామ్’ పుట్టింది. దీన్ని అన్ని రాష్ట్రాలూ అమలు చేశాయి. గత బుధవారం నాటికి దేశవ్యాప్తంగా 80 కోట్ల మొక్కలు నాటడం ద్వారా లక్ష్యాన్ని సాధించామని కేంద్ర పర్యావరణ శాఖ తెలిపింది.
‘తల్లిని గౌరవిస్తూ తల్లి పేరుతో మొక్కను నాటడం అనేది సెంటిమెంట్‌తో కూడిన అంశం. అందుకే దేశ ప్రజలు బాగా కనెక్టయ్యారు. మొక్కల్లో అమ్మను చూసుకుంటున్నారు. ఈ కారణంగా దేశవ్యాప్తంగా కొత్త మొక్కలు పుట్టాయి. తగ్గిపోతున్న వన సంపద మళ్లీ పెరుగుతోంది.’ అని ప్రధాని చెప్పారు. మన పర్యావరణాన్ని కాపాడుకోవాలనే భావన ప్రజల్లో బలంగా ఉందని, అందుకే ఈ ఉద్యమం సూపర్ హిట్ అవుతోందని అన్నారు.