Manmohan Singh | మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్.. పాకిస్థాన్ లోని పంజాబ్ రాష్ట్రంలోని గాహ్ లో 1932 సెప్టెంబర్ 26న గుర్ ముఖ్ సింగ్, అమృత్ కౌర్ దంపతులకు జన్మించారు. దేశ విభజన తర్వాత మన్మోహన్ సింగ్ కుటుంబం 1948లో హల్దవానీకి, తదుపరి అమృత్ సర్ కి వలస వచ్చింది. మన్మోహన్ సింగ్.. అమృత్ సర్ లోని హిందూ కాలేజీలో విద్యాభ్యాసం చేశారు.
పంజాబ్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశారు. 1952-54 మధ్య ఎకనమిక్స్ లో పీజీ పట్టా అందుకున్నారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లిన మన్మోహన్ సింగ్.. కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ఎకనమిక్స్ ట్రిపోస్ కోర్స్ పూర్తి చేశారు. కేంబ్రిడ్జి నుంచి స్వదేశానికి చేరుకున్న మన్మోహన్ సింగ్ పంజాబ్ యూనివర్సిటీలో టీచర్ గా పని చేశారు. తిరిగి ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్లి డీ.ఫిల్ చేశారు. ప్రారంభంలో విద్యావేత్తగా పని చేసిన మన్మోహన్ సింగ్.. 1972లోనే కేంద్ర ఆర్థికశాఖ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ గా సేవలందించారు. 1976లో ఆర్థికశాఖ కార్యదర్శిగా పని చేసిన మన్మోహన్ సింగ్.. 1980-82 మధ్య ప్రణాళికా సంఘంలో పని చేశారు. ఆర్థిక మంత్రిగా ప్రణబ్ ముఖర్జీ హయాంలో 1982లో ఆర్బీఐ గవర్నర్ గా నియమితులయ్యారు. 1985 వరకూ ఆర్బీఐ గవర్నర్ గా కొనసాగారు.
అటుపై 1985-87 మధ్య ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ గా పని చేశారు. 1987 నుంచి 1990 నవంబర్ వరకూ జెనివాలోని స్వతంత్ర ఆర్థిక విధాన సంస్థలో సౌత్ కమిషన్ సెక్రటరీ జనరల్ గా పని చేశారు. 1990 నవంబర్ నెలలో స్వదేశానికి తిరిగి వచ్చిన మన్మోహన్ సింగ్.. అప్పటి ప్రధాని చంద్రశేఖర్ హయాంలో ప్రధాని ఆర్థిక వ్యవహారాల సలహాదారుగా ఉన్నారు. 1991 మార్చిలో యూజీసీ చైర్మన్ గా నియమితులయ్యారు. తర్వాత 1991 లో అప్పటి ప్రధాని పీవీ నర్సింహారావు మంత్రి వర్గంలో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్.. సాహాసోపేతంగా ఆర్థిక సంస్కరణలు అమలు చేసి దేశ ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు కల్పించారు.