PM Modi | న్యూఢిల్లీ, జూలై 28: ‘మణిపూర్‌లో మహిళలపై దారుణాలు జరుగుతున్నప్పటికీ ప్రధాని మోదీ స్పందించడం లేదు. రాష్ట్రం మంటల్లో దహనమవుతుంటే మోదీ నిద్రపోతున్నారు. ఇటువంటి ఘటన మరెక్కడా జరగలేదు. నగ్న ఊరేగింపు తరహాలో రాష్ట్రంలో వందల ఘటనలు జరిగాయని సీఎం బీరేన్‌సింగ్ పేర్కొనడం సిగ్గుచేటు. బీరేన్‌సింగ్‌ను పదవి నుంచి తొలగించే దమ్ము ప్రధాని మోదీకి లేదు’ అని బీహార్ బీజేపీ అధికార ప్రతినిధి వినోద్ శర్మ ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. మణిపూర్‌లో జరుగుతున్న అకృత్యాలపై ప్రధాని మోదీ మౌనం వహించడంపై సొంత పార్టీ నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. కొన్ని రోజుల క్రితం మిజోరం రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు ఆ పార్టీకి రాజీనామా చేయగా, తాజాగా వినోద్ శర్మ రాజీనామా చేశారు. ‘మణిపూర్ అంశంపై పార్టీకి అనుకూలంగా మాట్లాడాలని నన్ను కోరారు. దాన్ని నేను తిరస్కరించాను. బీజేపీది అధికార యావ. ఆడబిడ్డల గురించి పార్టీలో ఎవరికీ ఆందోళన లేదు. బీజేపీలో కొనసాగడం కళంకంలా అనిపిస్తున్నది. పార్టీకి రాజీనామా చేస్తున్నా’ అని ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
తమ రాష్ట్ర అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని మిజోరం సీఎం జోరామ్తంగను మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్ హెచ్చరించారు. మిజోరం రాజధాని ఐజ్వాల్‌లో నిర్వహించిన ర్యాలీలో జోరామ్‌తంగ పాల్గొనడాన్ని బీరేన్‌సింగ్ తప్పుబట్టారు. కాగా, మణిపూర్‌లో జరిగిన మహిళల నగ్న ఊరేగింపు ఘటన బాధితుల స్టేట్మెంట్ను రికార్డు చేస్తున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.
మణిపూర్‌లో మహిళలపై చోటుచేసుకున్న దారుణ ఘటనపై లండన్‌లోని భారత హై కమిషన్ ఎదుట ఉమెన్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఇండియా సపోర్ట్ నెట్వర్క్ మౌన ప్రదర్శన నిర్వహించింది. మహిళలు ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం పార్లమెంట్ స్కేర్ వద్దనున్న మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు.