భోపాల్: ఒక వ్యక్తి కిడ్నాప్ అయ్యాడు. అయితే కిడ్నాపర్ స్మార్ట్‌వాచ్ అతడ్ని కాపాడింది. దాని ద్వారా ప్రియురాలికి ఎస్ఓఎస్ పంపాడు. ఆ వ్యక్తి తండ్రిని ఆమె అలెర్ట్ చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు అతడ్ని రక్షించారు. (Man Rescued With Kidnapper’s Smartwatch) మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గ్వాలియర్‌లోని కోటేశ్వర్ కాలనీలో నివసిస్తున్న 25 ఏళ్ల సౌరభ్ శర్మ, ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ జిల్లాలో హోటల్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. కొన్ని రోజుల కిందట సెలవుపై ఇంటికి తిరిగి వచ్చాడు.
కాగా, స్థానిక వడ్డీ వ్యాపారులు హేమంత్ శర్మ అలియాస్ చోటు త్యాగి, సచిన్ త్యాగి నుంచి సౌరభ్ శర్మ గతంలో రూ. 2.90 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఇప్పటికే రూ. 3.20 లక్షలు తిరిగి చెల్లించాడు. అయితే చక్రవడ్డీతో కలిపి రూ.6 లక్షలు చెల్లించాలని వడ్డీ వ్యాపారులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సౌరభ్ ఇంటి సమీపంలో ఉండగా వారిద్దరూ తారసపడ్డారు. బైక్‌పై తమ వెంట రావాలని డిమాండ్ చేశారు. అతడు నిరాకరించడంతో బలవంతంగా కిడ్నాప్ చేశారు.
మరోవైపు కిడ్నాప్ చేసిన సౌరభ్‌ను సచిన్ త్యాగి ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ గదిలో బంధించి డబ్బు చెల్లించాలని డిమాండ్ చేశారు. నిరాకరంచిన సౌరభ్‌ను కొట్టారు. స్పృహ కోల్పోయిన అతడ్ని గదిలో ఉంచి లాక్ వేశారు.
అయితే సచిన్‌కు చెందిన స్మార్ట్‌వాచ్ సమీపంలో ఉండటాన్ని సౌరభ్ గమనించాడు. దీంతో తెలివిగా వ్యవహరించాడు. ఆ స్మార్ట్‌వాచ్ ద్వారా తన ప్రియురాలికి ఎస్ఓఎస్ పంపాడు. లొకేషన్ షేర్ చేశాడు. ఆమెతో ఫోన్లో మాట్లాడాడు. వడ్డీ వ్యాపారులు తనను కిడ్నాప్ చేసినట్లు చెప్పాడు. తనకు సహాయం చేయాలని కోరాడు.
సౌరభ్ ప్రియురాలు వెంటనే స్పందించింది. అతడి తండ్రికి ఫోన్ చేసి అలెర్ట్ చేసింది. దీంతో సౌరభ్ తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. తన కుమారుడి కిడ్నాప్‌పై ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో తొలుత హేమంత్ శర్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి ద్వారా సచిన్‌ను సంప్రదించారు.
కాగా, పోలీసుల ఒత్తిడితో సౌరభ్‌ను సచిన్ వదిలేశాడు. అతడ్ని సురక్షితంగా అక్కడి నుంచి తరలించారు. ఆ తర్వాత సచిన్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వారిద్దరిని కోర్టులో హాజరుపర్చిన తర్వాత జైలుకు తరలించినట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Pritam Singh Kisaan | పోలీసులకు గుణపాఠం చెప్పేందుకు.. 55 రోజులు అదృశ్యమైన బీజేపీ నేత
Watch: రోడ్డుపై లేన్ మారిన క్యాబ్.. తర్వాత ఏం జరిగిందంటే?