న్యూఢిల్లీ: ఒక వ్యక్తి కోర్టు హాలులోని నేలపై బియ్యం విసిరాడు. (Man Throws Rice In Court) దీంతో చేతబడిగా న్యాయవాదులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేసుల విచారణను కొంతసేపు జడ్జి నిలిపివేశారు. కోర్టు హాలును శుభ్రం చేయించారు. ఆ వ్యక్తికి జైలు శిక్ష, జరిమానా విధించారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. ఆగస్ట్ 11న అదనపు సెషన్స్ జడ్జి షెఫాలి బర్నాలా టాండ కోర్టులో కేసుల విచారణ జరుపుతున్నారు. ఆ కోర్టు హాలు న్యాయవాదులతో నిండి ఉన్నది. ఇంతలో ఒక వ్యక్తి కోర్టు హాలులోని నేలపై బియ్యం విసిరాడు.
కాగా, కోర్టులోని న్యాయవాదులు ఇది చూసి ఆందోళన చెందారు. ఆ వ్యక్తి చర్యను చేతబడిగా అనుమానించారు. జడ్జి బల్ల వద్దకు వచ్చి కేసులు వాదించేందుకు న్యాయవాదులు సందేహించారు. ఈ విషయాన్ని న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో జడ్జి షెఫాలి బర్నాలా స్పందించారు. నేలపై ఉన్న బియాన్ని ఏరి తీయాలని ఆ వ్యక్తిని ఆదేశించారు. స్వీపర్ను పిలిచి శుభ్రం చేయించాలని చెప్పారు. అప్పటి వరకు కేసుల విచారణను నిలిపివేశారు. వర్చువల్గా హాజరైన నిందితుడి తరుఫు న్యాయవాదికి ఈ విషయం చెప్పారు. దీంతో స్వయంగా కోర్టుకు హాజరయ్యేందుకు కొంత గడువును ఆ లాయర్ కోరారు. ఇంతలో నిందితుడు మోకాళ్లపై కూర్చుని కోర్టుకు క్షమాపణలు చెప్పాడు.
మరోవైపు మధ్యాహ్నం కోర్టు తిరిగి ప్రారంభమైన తర్వాత ఈ షాకింగ్ సంఘటనపై న్యాయమూర్తి షెఫాలి బర్నాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వృత్తి రీత్యా సర్జన్. విద్యావంతుడు, ఉన్నత వర్గానికి చెందిన నిందితుడైన డాక్టర్ చందర్ విభాస్ ఇంత అసమంజసంగా ప్రవర్తించి కోర్టు కార్యకలాపాలకు అంతరాయం కలిగించడం చాలా దిగ్భ్రాంతికరం, ఆశ్చర్యకరమని అన్నారు. కోర్టు కార్యకలాపాలను సుమారు 20 నిమిషాల పాటు నిలివేసిన నేరానికి గాను అతడికి నోటీస్ జారీ చేశారు. నిందితుడు క్షమాపణ చెప్పడంతోపాటు పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేశాడు. తన క్లయింట్ మరోసారి ఇలా చేయబోడని అతడి తరుఫు న్యాయవాది హామీ ఇచ్చారు. దీంతో కోర్టు విధులు తిరిగి ప్రారంభమయ్యే వరకు జైలు శిక్షతోపాటు రూ.2,000 జరిమానాను జడ్జి విధించారు.
Also Read:
Man Tied To Pole Thrashed | అల్లున్ని స్తంభానికి కట్టేసి కొట్టి.. రాత్రంతా అలాగే ఉంచిన అత్తమామలు
Watch: ఒకేచోట జాతీయ జంతువు పులి, జాతీయ పక్షి నెమలి.. అరుదైన వీడియో వైరల్