ఫరీదాబాద్: ఒక వ్యక్తి తన కోడలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెను చంపిన తర్వాత ఇంటి వద్ద తవ్విన పది అడుగుల గోతిలో కోడలి మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు. (Woman Killed Buried) ఆమె కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేసిన పోలీసులు అత్తింటి వారిని అరెస్ట్ చేశారు. హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లా షికోహాబాద్‌కు చెందిన 24 ఏళ్ల మహిళకు ఫరీదాబాద్‌కు చెందిన వ్యక్తితో 2023 జూలైలో పెళ్లి జరిగింది.
కాగా, పెళ్లైన నాటి నుంచి అదనపు కట్నం కోసం అత్తింటి వారు ఆ మహిళను వేధించారు. ఈ నేపథ్యంలో ఆమెను చంపాలని ప్లాన్ చేశారు. ఏప్రిల్ 14న ఉత్తరప్రదేశ్‌లో జరిగిన వివాహం కోసం మహిళ అత్త అక్కడకు వెళ్లింది. ఏప్రిల్ 21న రాత్రివేళ నిద్రమాత్రలు కలిపిన ఆహారాన్ని భార్య, సోదరికి ఆ మహిళ భర్త వడ్డించాడు. ఆహారం తిన్న తర్వాత వారిద్దరూ వేర్వేరు అంతస్తుల్లోని గదుల్లో మత్తుగా నిద్రించారు.
మరోవైపు ప్లాన్‌లో భాగంగా కోడలిని చంపేందుకు ఆమె నిద్రించిన గదిలోకి మామ ప్రవేశించాడు. స్పృహలో లేని కోడలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమెను హత్య చేశాడు. కుమారుడితో కలిసి కోడలి మృతదేహాన్ని ఇంటి బయటకు తెచ్చాడు. డ్రైనేజీ పిట్ కోసమంటూ ముందుగా తవ్వి ఉంచిన పది అడుగుల లోతైన గోతిలో ఆమె మృతదేహాన్ని ఉంచి పూడ్చివేశారు. ఆ తర్వాత దానిపై కాంక్రీట్ స్లాబ్ నిర్మించారు.
కాగా, తన కోడలు కనిపించడం లేదని ఏప్రిల్ 25న పోలీసులకు మామ ఫిర్యాదు చేశాడు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే అత్తింటి వారే ఆ మహిళను హత్య చేసి మృతదేహాన్ని గోతిలో పాతిపెట్టినట్లు రెండు నెలల తర్వాత పోలీసులు తెలుసుకున్నారు. జూన్ 21న జేసీబీతో అక్కడ తవ్వించి కుళ్లిన మహిళ మృతదేహాన్ని వెలికితీశారు.
మామను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా కోడలిపై అత్యాచారానికి పాల్పడిన తర్వాత హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో మామతోపాటు మహిళ భర్త, అత్త, ఆమె కుమార్తెను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని కస్టడీకి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
Gold Stolen From Judge’s Bedroom | హైకోర్టు న్యాయమూర్తి బెడ్రూమ్ నుంచి.. బంగారం చోరీ
Watch: మహిళా పోలీస్ అధికారిణి పట్ల.. అసభ్యకరంగా ప్రవర్తించిన బీజేపీ నేత, కేసు నమోదు
Watch: మూత్రంతో కళ్లు కడుక్కున్న మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?