న్యూఢిల్లీ: పది వేలు అప్పుగా ఇవ్వనందుకు ఒక వ్యక్తిని సహోద్యోగి హత్య చేశాడు. (Man Killes Colleague) ఫామ్‌హౌస్‌లోని ట్యాంకులో మృతదేహాన్ని పడేశాడు. ఆ వ్యక్తి మిస్సింగ్‌పై ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చివరకు నిందితుడైన సహోద్యోగిని అరెస్ట్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 42 ఏళ్ల సీతా రామ్ గత పదేళ్లుగా ఢిల్లీలోని ఛత్తర్‌పూర్‌లో ఉన్న ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లో పని చేస్తున్నాడు. అతడు ఒంటరిగా అక్కడ నివసిస్తున్నాడు.
కాగా, 47 ఏళ్ల చంద్ర ప్రకాష్ అదే ఫామ్‌హౌస్‌లో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. సీతా రామ్‌ను అతడు పది వేలు అప్పు అడిగాడు. ఇవ్వకపోవడంతో వారిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో చంద్ర ప్రకాష్ ఆగ్రహించాడు. బండరాయితో మోది సీతా రామ్‌ను హత్య చేశాడు. ఆ ఫామ్‌హౌస్‌లోని ట్యాంకులో మృతదేహన్ని పడేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు.
మరోవైపు జూలై 26న ఫామ్‌హౌస్ మెయిన్ గేట్ తెరిచి ఉండటాన్ని మిగతా పనివాళ్లు గమనించారు. సీతా రామ్ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఫామ్‌హౌస్‌లోని ట్యాంకులో అతడి మృతదేహాన్ని గుర్తించారు. మృతుడి మొబైల్ ఫోన్ డాటా, సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు.
అయితే, చంద్ర ప్రకాష్ కూడా కనిపించకపోవడంతో అతడిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. పాలం ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. అతడ్ని ప్రశ్నించగా పది వేలు అప్పు ఇవ్వనందుకు జరిగిన ఘర్షణలో సీతా రామ్‌ను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Farmer Annual Income Rs.3 | దేశంలోనే పేద రైతు.. వార్షిక ఆదాయం రూ.3గా ఇన్కమ్ సర్టిఫికెట్ జారీ
child bites cobra snake to death | చేతికి చుట్టుకున్న నాగుపాము.. కొరికి చంపిన ఏడాది బాలుడు