రాంచీ: ఒక వ్యక్తి ఇద్దరు మహిళలను హత్య చేశాడు. వారి మృతదేహాలను ఒక చోట పాతిపెట్టాడు. మహిళల మిస్సింగ్‌పై దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు. అయితే పోలీస్ కస్టడీలో అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. (man kills two women) జార్ఖండ్‌లోని గిర్డిహ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శ్రీకాంత్ చౌదరి అనే వ్యక్తికి 25 ఏళ్ల సోని దేవితో చాలా కాలంగా సంబంధం ఉన్నది. అటవీ ప్రాంతంలో ఆమెను రహస్యంగా కలిసేవాడు. అయితే ఆమెకు మరి కొందరితో సంబంధం ఉన్నట్లు అతడు అనుమానించాడు.
కాగా, సెప్టెంబర్ 8న 32 ఏళ్ల రింకు దేవితో కలిసి సోని దేవి ఆకులు సేకరించేందుకు అటవీ ప్రాంతానికి వెళ్లింది. అక్కడ మాటువేసిన శ్రీకాంత్ గొంతునొక్కి సోని దేవిని హత్య చేశాడు. సాక్ష్యం లేకుండా చేసేందుకు ఆమె వెంట ఉన్న రింకు దేవిని కూడా చంపాడు. అటవీ ప్రాంతంలో గొయ్యి తవ్వి మృతదేహాలను పాతిపెట్టాడు.
మరోవైపు ఇద్దరు మహిళల అదృశ్యంపై వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మొబైల్ ట్రాకింగ్ ఆధారంగా శ్రీకాంత్‌ను నిందితుడిగా గుర్తించారు. మంగళవారం అతడ్ని అరెస్ట్ చేసి ప్రశ్నించగా నిజాన్ని ఒప్పుకున్నాడు. అలాగే మహిళల మృతదేహాలను పాతిపెట్టిన ప్రదేశాన్ని పోలీసులకు చూపించాడు. దీంతో మృతదేహాలను వెలికి తీసి పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కాగా, ఇద్దరు మహిళల హత్యలపై గ్రామస్తులు ఆగ్రహంతో రగిలిపోయారు. మంగళవారం పెద్ద సంఖ్యలో గవాన్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. నిందితుడైన శ్రీకాంత్‌ను తమకు అప్పగించాలని, అతడ్ని చంపి న్యాయం చేస్తామని డిమాండ్ చేశారు. అయితే గవాన్ పోలీస్ స్టేషన్‌లోని కాన్ఫరెన్స్ రూమ్‌లో ఉన్న శ్రీకాంత్ ఉరివేసుకుని కనిపించాడు. పోలీసులు అతడ్ని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.
మరోవైపు శ్రీకాంత్ గొంతుపై తెగిన గాయం ఉన్నదని స్థానికులు ఆరోపించారు. స్టేషన్‌లోని సెల్లో అతడ్ని ఉంచకపోవడం, ఆత్మహత్య చేసుకున్నాడన్న పోలీస్ అధికారి వాదనపై అనుమానాలు వ్యక్తం చేశారు. మహిళల జంట హత్యలతోపాటు నిందితుడు శ్రీకాంత్ మరణంపై నిష్పాక్షికంగా దర్యాప్తు చేయాలని వారి కుటుంబ సభ్యులు, స్థానికులు డిమాండ్ చేశారు.
Also Read:
JK AAP MLA Arrest | ఎమ్మెల్యే అరెస్ట్‌పై నిరసనలు.. ఇంటర్నెట్ నిలిపివేత, పరీక్షలు రద్దు
Watch: కారు సన్‌రూఫ్ వద్ద నిల్చొన్న బాలుడు.. తర్వాత ఏం జరిగిందంటే?