బెంగళూరు: ఒక వ్యక్తికి ముగ్గురు భార్యలు ఉన్నారు. వారిని చూసుకోవడంతోపాటు 9 మంది పిల్లలను పోషించేందుకు అతడు దొంగగా మారాడు. (Man Becomes Thief To Maintain 3 Wives) ఒక కుమారుడికి దొంగతనంలో ట్రైనింగ్ కూడా ఇచ్చాడు. తండ్రీకొడుకులు కలిసి చోరీలకు పాల్పడ్డారు. ఒక దొంగతనం కేసులో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. 35 ఏళ్ల బాబాజాన్కు ముగ్గురు భార్యలున్నారు. శ్రీరంగపట్నం, అనేకల్, చిక్కబళ్లాపురలో విడివిడిగా వారు నివసిస్తున్నారు. అతడికి 9 మంది సంతానం. ఎనిమిది మంది కుమార్తెలు కాగా ఒక కుమారుడు.
కాగా, ముగ్గురు భార్యలు, 9 మంది పిల్లలున్న పెద్ద కుటుంబాన్ని పోషించేందుకు బాబాజాన్ దొంగగా మారాడు. బెంగళూరులో వరుస దొంగతనాలకు పాల్పడ్డాడు. మైనర్ కుమారుడికి చోరీలు చేయడంలో శిక్షణ ఇచ్చాడు. మే 7న బెట్టడసనపురలోని 56 ఏళ్ల మహిళ ఇంట్లో తండ్రీకొడుకులు చోరీకి పాల్పడ్డారు. బట్టలు ఆరవేసేందుకు ఆమె టెర్రస్ పైకి వెళ్లగా ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, నగదును దొంగిలించారు.
మరోవైపు ఫిర్యాదు అందుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితులను గుర్తించారు. చివరకు బాబాజాన్, అతడి మైనర్ కుమారుడ్ని పట్టుకున్నారు. ఆ వ్యక్తిని ప్రశ్నించగా ముగ్గురు భార్యలు, 9 మంది పిల్లలున్న పెద్ద కుటుంబాన్ని పోషించేందుకు దొంగగా మారినట్లు పోలీసులకు చెప్పాడు. అతడ్ని విచారించడంతో 9 చోరీ కేసులను ఛేదించినట్లు పోలీస్ అధికారి తెలిపారు. 180 గ్రాముల బంగారం, 550 గ్రాముల వెండి, ఒక ద్విచక్ర వాహనం, కొంత నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
Also Read: