ముంబై: మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో 2021లో ఓ కొవిడ్ రోగిని చంపేయాలని తన సహ వైద్యునికి చెప్పిన సీనియర్ డాక్టర్‌పై కేసు నమోదైంది. అదృష్టవశాత్తూ ఆమె కోలుకుని, ఇంటికి వెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఉద్గిర్ ప్రభుత్వ దవాఖానలో కౌసర్ ఫాతిమా (41) కొవిడ్-19 చికిత్స కోసం 2021లో చేరారు. ఆ సమయంలో మహమ్మారి తీవ్ర స్థాయిలో ఉంది.
డాక్టర్ శశికాంత్ దేశ్‌పాండే ఈ దవాఖానలో అదనపు జిల్లా సర్జన్‌గా పని చేశారు. కొవిడ్ కేర్ సెంటర్లో డాక్టర్ శశికాంత్ డాంగే పని చేశారు. ఆ సమయంలో దవాఖానలు కొవిడ్ రోగులతో రద్దీగా ఉండేవి. దేశ్‌పాండే తన సహోద్యోగి డాక్టర్ డాంగేకు ఫోన్ చేసినట్లు ఓ ఆడియో క్లిప్ ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వచ్చింది. దీనిలో డాక్టర్ దేశ్‌పాండే మాట్లాడుతూ, ‘ఎవరినీ లోపలికి వెళ్లనివ్వొద్దు.
దయామీ మహిళను చంపేయ్’ అని చెప్పినట్లు వినిపించింది. దీనికి డాక్టర్ డాంగే బదులిస్తూ, ఆమెకు ఆక్సిజన్ సపోర్ట్‌ను తగ్గించామని చెప్పినట్లు వినిపించింది. వీరి మధ్య ఫోన్ సంభాషణ జరిగినపుడు తాను డాక్టర్ డాంగే వద్ద ఉన్నానని రోగి భర్త దయామీ అజిమొద్దిన్ గౌసుద్దీన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. ఏడో రోజున ఈ డాక్టర్లు ఈ విధంగా మాట్లాడుకున్నారన్నారు .