Kamal Haasan | తమిళం నుంచి కన్నడ భాష పుట్టిందంటూ ప్రముఖ నటుడు కమల్‌హాసన్ (Kamal Haasan) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. కన్నడ (Kannada) భాషపై చేసిన వ్యాఖ్యలకు గానూ ఆయన బహిరంగ క్షమాపణలు (public apology) చెప్పాలనే డిమాండ్లు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజా వివాదంపై కమల్ హాసన్ స్పందించారు. ఈ విషయంలో క్షమాపణలు చెప్పేందుకు ఆయన నిరాకరించారు. తప్పు చేసి ఉంటేనే క్షమాపణలు చెప్తానని స్పష్టం చేశారు. ‘నేను తప్పు చేస్తే క్షమాపణలు చెప్తాను. లేదంటే చెప్పను. ఇది నా శైలి. ఈ విషయంలో ప్రజలు జోక్యం చేసుకోవద్దు’ అంటూ చెప్పుకొచ్చారు. భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశం అని తాను చట్టం, న్యాయాన్ని నమ్ముతానని వ్యాఖ్యానించారు.
ఇంతకీ ఏం జరిగిందంటే..?
కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం చెన్నైలో జరిగిన సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో కమల్‌హాసన్ మాట్లాడుతూ.. ‘కన్నడం.. తమిళం నుంచి పుట్టింది’ అని కామెంట్ చేశారు. ఇదే కార్యక్రమానికి కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కూడా హాజరయ్యారు. ఆయన ఎదుటే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఉయిరే, ఉరవే తమిళే (నా ప్రాణం, నా బంధుత్వం తమిళం) అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన కమల్ హాసన్ అనంతరం కన్నడ స్టార్ శివరాజ్ కుమార్‌ని ఉద్దేశించి మాట్లాడారు.
‘శివరాజ్‌కుమార్ వేరే రాష్ట్రంలో నివసిస్తున్నా నా కుటుంబ సభ్యుడు. అందుకే ఆయన ఈ రోజు ఇక్కడ ఉన్నారు. అందుకే నా ప్రసంగం మొదలుపెట్టేటప్పుడు.. నా జీవితం, నా కుటుంబం తమిళ భాష అని చెప్పా. మీ భాష (కన్నడ) తమిళ నుంచే పుట్టింది. ఆ విధంగా మీరు భాగస్వామి అయ్యారు’ అని శివరాజ్‌కుమార్‌ను ఉద్దేశించి అన్నారు. అయితే తమిళం నుంచి కన్నడ పుట్టిందన్న కమల్ వ్యాఖ్యలపై కన్నడ సంఘాలు భగ్గుమన్నాయి. బెంగళూరులో థగ్‌లైఫ్ సినిమా బ్యానర్లను కొందరు ఆందోళనకారులు చించివేశారు. ‘కర్ణాటకలో మీకు వ్యాపారం కావాలి.. కానీ కన్నడ భాషను అవమానిస్తారా?’ అని ధ్వజమెత్తారు.
Also Read..
“Kamal Hassan | కన్నడ భాషా వివాదం.. క్లారిటీ ఇచ్చిన కమల్ హాసన్”
“Kamal Haasan | కమల్ హాసన్‌ని కలిశాక మూడు రోజులు స్నానం చేయలేదు : శివరాజ్ కుమార్”