చెన్నై, మే 28: నటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ రాజ్యసభ సభ్యునిగా ఎన్నిక కానున్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి ఆయన పార్టీ మద్దతు ఇవ్వడమే కాక, డీఎంకే తరపున ఆయన తమిళనాడులో ప్రచారం చేశారు. దాంతో ఆయన రాజ్యసభలో అడుగుపెట్టేందుకు డీఎంకే పూర్తి సహకారం అందించనుంది.
కాగా, జూన్ 19న జరిగే రాజ్యసభ ద్వై వార్షిక ఎన్నికల్లో ఆయనను పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేసినట్టు ఎంఎన్ఎం బుధవారం ప్రకటించింది. ఎంఎన్ఎం కమల్ హాసన్ పేరును ప్రతిపాదించగానే రాజ్యసభ సీటును ఆయనకు కేటాయిస్తున్నట్టు మిత్రపక్ష పార్టీ డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించారు. 2024లో ఎంఎన్ఎం పార్టీతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని అనుసరించి స్టాలిన్ ఈ కేటాయింపు చేశారని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా, ప్రస్తుతం ఎంఎన్ఎం పార్టీకి శాసనసభ, పార్లమెంట్లో ఎలాంటి ప్రాతినిధ్యం లేదు.