Kamal Hassan | సీనియర్ నటుడు కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ చిత్రం మరి కొద్ది రోజులలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్స్‌లో యాక్టివ్‌గా పాల్గొంటున్నారు కమల్. అయితే ఆయన ఓ సందర్భంలో కన్నడ భాషపై చేసిన కామెంట్స్ తీవ్ర దుపారం రేపాయి. శివరాజ్ కుమార్ ను ఉద్దేశిస్తూ.. కన్నడ కూడా తమిళం నుంచే పుట్టిందని అనడంతో కన్నడిగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కమల్ హాసన్ క్షమాపణలు చెప్పకపోతే థగ్ లైఫ్ సినిమాని ఆడనివ్వం అంటూ సీరియస్ అయ్యారు. పలువురు రాజకీయ నాయకులు కూడా ఈ ఇష్యూపై మండిపడ్డారు. ఈ క్రమంలో కమల హాసన్ స్పందించారు. ఆ వ్యాఖ్యలు నేను కేవలం ప్రేమతో చేసిన వ్యాఖ్యలేనని.. తనకు వేరే ఉద్దేశం లేదంటూ క్లారిటీ ఇచ్చారు.
నేను ప్రేమతో అలా చెప్పాను. ఎంతోమంది చరిత్రకారులు భాషా చరిత్ర గురించి నాకు చెప్పగా, నేను అలానే అన్నాననే తప్ప నా కామెంట్స్‌లో మరో ఉద్దేశం లేదు. తమిళనాడు అరుదైన రాష్ట్రం. ఎంతో విశాల దృక్పథం కలిగినది, తమిళనాడులో కేవలం తమిళులే కాకుండా ఇతర భాషా నేపథ్యం ఉన్నవారు కూడా అత్యున్నత పదవులు అలంకరించారు. ఓ మేనన్ (ఎంజీ రామచంద్రన్) ముఖ్యమంత్రిగా చేశారు. ఓ రెడ్డి (ఒమందూర్ రామసామి రెడ్డియార్) సీఎం అయ్యారు. మైసూర్ సంస్థానంలో పనిచేసిన నరసింహన్ రంగచారి మనవరాలు (జయలలితను ఉద్దేశిస్తూ) కూడా ముఖ్యమంత్రిగా చేశారు.
చెన్నైలో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు కర్ణాటక నాకు మద్దతుగా నిలిచింది. భాష అనేది చాలా సున్నితమైన అంశం. దాని గురించి మాట్లాడేందుకు రాజకీయ నాయకులు అర్హులు కారు. నిజం చెప్పాలంటే, ఆ అర్హత నాకు కూడా లేదు అంటూ కమల్ హాసన్ చెప్పుకొచ్చారు. భాషా సంబంధిత విషయాల్లో రాజకీయ నాయకుల జోక్యం అనవసర పరిస్థితులకి దారి తీస్తుంది. తన వ్యాఖ్యల వలన ఎవరి మనోభావాలు అయిన దెబ్బ తిని ఉంటే క్షమాపణలు కోరుతున్నాను. రానున్న రోజులలో ఇలాంటి విషయాలలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తాను అంటూ పరోక్షంగా సూచించారు. భాష అనేది ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించే సాధనం కావాలి తప్ప, విభేదాలకు కారణం కాకూడదని కమల్ హాసన్ హితవు పలికారు. దీనిపై లోతైన చర్చను చరిత్రకారులకు, పురావస్తు శాస్త్రవేత్తలు, భాషా నిపుణులకు వదిలేద్దాం అని అన్నారు కమల్.