అహ్మదాబాద్: ఇంటి బయట ఉన్న ఒక వ్యక్తిపై చిరుత దాడి చేసింది. అతడు కేకలు వేయడంతో ఇంటి లోపల నుంచి కొడుకు బయటకు వచ్చాడు. ఆ యువకుడిపైనా చిరుత దాడి చేసింది. ఈ నేపథ్యంలో కుమారుడిని కాపాడేందుకు కొడవలితో చిరుతను చంపాడు. (Man Kills Leopard) గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఉనా ప్రాంతంలో నివసించే 60 ఏళ్ల బాబూభాయ్ నారన్‌భాయ్ వాజా, బుధవారం రాత్రి వేళ ఇంటి ముందున్న షెడ్లో నిద్రించేందుకు మంచంపై కూర్చొన్నాడు. అక్కడకు వచ్చిన చిరుత అతడిపై దాడి చేసింది. దీంతో దానిని ఎదుర్కొంటూ కేకలు వేశాడు.
కాగా, తండ్రి అరుపులు విన్న 27 ఏళ్ల కుమారుడు శార్దూల్ వెంటనే ఇంటి నుంచి బయటకు పరుగున వచ్చాడు. అతడ్ని చూసిన చిరుత తండ్రిని వదిలేసి కుమారుడిపై దాడి చేసింది. కొడుకును రక్షించడానికి బాబూభాయ్ ప్రయత్నించగా తిరిగి అతడిపై దాడి చేసింది. ఆ తర్వాత మళ్లీ అతడి కొడుకుపై ఎటాక్ చేసింది. ఈ నేపథ్యంలో బాబూభాయ్ కొడవలితో ఆ చిరుతపై దాడి చేశాడు. అనంతరం కర్రతో కొట్టి చంపాడు.
మరోవైపు చిరుత దాడిలో గాయపడిన తండ్రీ, కొడుకు తొలుత ఉనాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స పొందారు. మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు.
ఈ సమాచారం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చిరుత కళేబరాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. దానిని చంపేందుకు వినియోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. బాబుభాయ్, శార్దూల్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అటవీ శాఖ అధికారి తెలిపారు.
Also Read:
Watch: హెల్మెట్ లేకుండా బైక్ నడిపిన ఎమ్మెల్యే సోదరుడు.. జరిమానా విధించిన పోలీసులకు బెదిరింపు
Watch: పెళ్లిలో ముద్దుపెట్టుకోబోయిన వధూవరులు.. తర్వాత ఏం జరిగిందంటే?