Mamata Banerjee : ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కు వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్ (West Bengal) లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఆ ఆందోళనకు ముఖ్యమంత్రి మమతాబెనర్జీ (CM Mamata Banerjee) నాయకత్వం వహించారు. మంగళవారం కోల్కతా వీధుల్లో నిర్వహించిన భారీ ర్యాలీని ఆమె ముందుండి నడిపించారు.
ఓటర్ల జాబితా సమగ్ర సవరణ బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం కుమ్మక్కై నిర్వహిస్తున్న నిశ్శబ్ద రిగ్గింగ్ అని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. బెనర్జీతోపాటు ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కూడా ర్యాలీలో పాల్గొన్నారు. మొత్తం 3.8 కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహించారు. దాంతో దారులన్నీ తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలతో నిండిపోయాయి. అయితే ఈ నిరసనలపై బీజేపీ తీవ్రంగా మండిపడింది.
భారత రాజ్యాంగ విలువలకు వ్యతిరేకంగా టీఎంసీ వ్యవహరిస్తోందని విమర్శించింది. మమతా బెనర్జీ ఎస్ఐఆర్లో లోపాలను ఎత్తి చూపాలనుకుంటే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని సూచించారు. కాగా రెండో దశలో భాగంగా 12 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టనున్నట్లు ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
‘అండమాన్ నికోబార్, ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, కేరళ, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు, యూపీ, పశ్చిమబెంగాల్లో జరగనున్న రెండో దశలో 51 కోట్ల మంది ఓటర్లు భాగం కానున్నారని తెలిపింది. ఈసీ ప్రకటించిన ప్రకారం మంగళవారం నుంచి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ మొదలైంది.