Amit Shah : పశ్చిమ బెంగాల్‌లోని, మమతా బెనర్జీ ఆధ్వర్యంలో నడుస్తున్న టీఎంసీ ప్రభుత్వంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిప్పులు చెరిగారు. దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం మమతా బెనర్జీదే అని వ్యాఖ్యానించారు. ప.బెంగాల్, సిలిగురిలో శనివారం జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని టీఎంసీ పాలనను తీవ్రంగా తప్పుబట్టారు.
‘‘భారత సరిహద్దు (పశ్చిమ బెంగాల్) ప్రాంతంలో కంచె ఏర్పాటు చేసేందుకు బీఎస్ఎఫ్కు భూమి అవసరం. సరిహద్దులో కంచె ఏర్పాటు చేసేందుకు స్థలం కావాలని మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని కోరాం. ఈ అంశంపై ఇప్పటికే మమతకు ఏడుసార్లు లేఖలు రాశాం. చివరకు నేనే నేరుగా మమత కార్యాలయానికి వెళ్లి మరీ భూమి గురించి అడిగా. కానీ, ఇంతవరకు భూమి కేటాయించలేదు. బెంగాల్‌లోని ప్రతి వర్గం ఒకరితో ఒకరు గొడవ పడేలా చేసి, ఐకమత్యాన్ని దెబ్బతీయడంలో మమత సిద్ధహస్తురాలు. దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం మమతా బెనర్జీది. ఇంత అవినీతికి పాల్పడే ప్రభుత్వం మరొకటి లేదు. ఆనందపూర్ వేర్ హౌజ్‌లోని మోమో ఫ్యాక్టరీలో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన వారికి నా నివాళులు. ఇది ప్రమాదవశాత్తు జరిగింది కాదు. మమతా బెనర్జీ అవినీతి వల్ల జరిగిన ఘటన.
ఈ ఫ్యాక్టరీలో ఎవరి డబ్బు ఉంది..? ఫ్యాక్టరీ ఓనర్ విదేశాలకు ఎలా వెళ్లారు..? ఆయనను ఎందుకు అరెస్టు చేయలేదు..? ప్రమాదం జరిగిన 32 గంటల తర్వాతగానీ మంత్రి అక్కడకు చేరుకోలేదు. ఈ ప్రమాదంపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మమత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా’ అని అమిత్ షా వ్యాఖ్యానించారు. కాగా.. ఈ ఘటనలో 21 మంది కూలీలు మరణించారు.