న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత తమ తదుపరి లక్ష్యం ఢిల్లీ పీఠం నుంచి బీజేపీని కూలదోయడమేనని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. గురువారం చౌరింగీలో జరిగిన ఒక ఎన్నికల సభలో ఆమె మాట్లాడుతూ బెంగాల్లో విజయం సాధించిన తర్వాత బీజేపీని నాశనం చేయాలని అనుకుంటున్నామని, కమలం పార్టీని గద్దె దించి ఢిల్లీలో అధికారాన్ని కైవసం చేసుకుంటామని అన్నారు. ‘బీజేపీకి మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న ప్రతి ఒక్కరి పేర్లను వారి చిరునామాలతో సహా నేను నమోదు చేసుకుంటున్నా.
గుర్తుంచుకోండి మీకు (బీజేపీకి) మమ్మల్ని ఓడించే సత్తా లేదు. మేం అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం. మా హక్కుల కోసం పోరాడుతున్నాం. నేను పుట్టింది బెంగాల్లో, ఆఖరి శ్వాస తీసుకునేది కూడా బెంగాల్లోనే’ అని ఆమె అన్నారు. ‘నేను అధికార పీఠాన్ని ఆశించను. ఢిల్లీలో బీజేపీని అధికారంలోంచి కూలదోయడమే నా లక్ష్యం. బెంగాల్లో వారి పతనం అనివార్యమే అయినప్పటికీ, ఢిల్లీ నుంచి కూడా వారిని కూలదోయాల్సిందే’ అని ఆమె పేర్కొన్నారు. అయితే ఆమె ప్రకటనను కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపహాస్యం చేశారు.