కోల్కతా: పశ్చిమ బెంగాల్లో రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యలో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ భారీ నిరసనలకు సిద్ధమయ్యారు. (Mamata Banerjee) జూన్ 1న రాష్ట్రవ్యాప్తంగా వార్డు, మండల, బ్లాక్ స్థాయిలలో నిరసనలు చేపట్టాలని టీఎంసీ నిర్ణయించింది. జూన్ 2న కోల్కతాలోని రాణి రష్మోని రోడ్లో ఒక రోజు ధర్నాకు మమతా బెనర్జీ నేతృత్వం వహించనున్నారు.
కాగా, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ ఆ రాష్ట్రంలో తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో బీజేపీ, టీఎంసీ మధ్య రాజకీయ ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఎన్నికల అనంతరం హింసాత్మక సంఘటనలు కొనసాగుతున్నాయి. ప్రభావిత కుటుంబాలను పరామర్శించేందుకు శనివారం సోనార్పూర్లో పర్యటించిన టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై గుడ్లు, రాళ్లతో బీజేపీ కార్యకర్తలు దాడి చేయడంతో ఆయన గాయపడ్డారు.
మరోవైపు ఆదివారం హుగ్లీ జిల్లాలోని చండితలా పోలీస్ స్టేషన్ సమీపంలో టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీపై దాడి జరిగింది. ఎన్నికల అనంతర హింసాకాండపై వినతిపత్రం సమర్పించేందుకు వెళ్తున్న ఆయన తలకు రాయి తగలడంతో కిందపడిపోయారు. పోలీస్ స్టేషన్ బయట బీజేపీ కార్యకర్తలు తనపై దాడి చేశారని, తనను హత్య చేసేందుకు ప్రయత్నించారని కళ్యాణ్ బెనర్జీ ఆరోపించారు.