హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): ‘వైద్య రంగానికి కాంగ్రెస్ సర్కార్ పెద్దపీట వేస్తున్నది. ప్రస్తుతం నగరంలో నిర్మిస్తున్న టిమ్స్ సూపర్ స్పెషాలిటీ దవాఖానను ఈ ఏడాది డిసెంబర్ 9న ప్రారంభిస్తాం. సర్కార్ దవాఖానల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తాం.’
– ఇవి నిరుడు జూలై 2నబంజారాహిల్స్లో ఓ ప్రైవేట్ దవాఖానను ప్రారంభించిన సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు.
సీఎం ఈ వ్యాఖ్యలు చేసి సరిగ్గా ఏడాది గడిచింది. అయినా ఒక్కటంటే ఒక్క టిమ్స్ కూడా ప్రారంభానికి నోచుకోకపోవడం కాంగ్రెస్ సర్కార్ చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తున్నది. మరోవైపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేండ్లు కావస్తుండగా.. గురువారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో మూడు టిమ్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖానలో మొత్తం 6,278 పోస్టులకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో 1,494 రెగ్యులర్, 549 కాంట్రాక్టు, 4,235 ఔట్ సోర్సింగ్ విధానంలో చేపట్టనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ దవాఖానల్లో రెగ్యులర్ వైద్యులు, సిబ్బందికి ఎయిమ్స్ తరహాలో వేతనాలు చెల్లించాలని సర్కార్ నిర్ణయించింది. మరోవైపు ఏటా వేతనాలు, దవాఖానల నిర్వహణకు రూ.1,075 కోట్ల వ్యయమవుతుందని అధికారులు అంచనాలు రూపొందించారు. తాజాగా టిమ్స్లతో పాటు వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖానలో పోస్టులకు క్యాబినెట్ ఆమోదం తెలిపినా.. ఆర్థికశాఖ ఆయా పోస్టులకు ఆమోదం తెలుపాల్సి ఉంటుంది. తర్వాత నోటిఫికేషన్ వేసి పోస్టులను భర్తీ చేయాల్సి ఉన్నది.
నత్తనడకన నియామక ప్రక్రియ
ఇప్పటికే వైద్యశాఖలో అనేక పోస్టుల భర్తీ ప్రక్రియ నత్తనడకన సాగుతున్నది. ఫ్యామిలీ అండ్ హెల్త్ వెల్ఫేర్ పరిధిలో 145, తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ)లో 1,658 పోస్టుల నియామక ప్రక్రియ కొలిక్కి రావడం లేదు. ఇవికాక వైద్యశాఖలో ఇంకా 3,215 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) పరిధిలో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ ఏకంగా ఏడాది సమయం తీసుకున్నది. ఇప్పుడు క్యాబినెట్ అప్రువల్ తెలిపిన 6,278 పోస్టుల భర్తీకి ఎంత సమయం తీసుకుంటారో తేలాల్సి ఉన్నది. నాడు బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా మూడు టిమ్స్లు, వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖానకు శంకుస్థాపన చేశారు.
నగరంలోని పెద్దాసుపత్రులైన గాంధీ, ఉస్మానియా సహా ఇతర దవాఖానలపై భారం తగ్గాలని, రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని సంకల్పించారు. ఆసుపత్రులను అందుబాటులోకి తేవాలని పనులు ప్రారంభించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయా దవాఖానల పనులు నత్తనడకన సాగుతున్నాయి. సరైన ప్రణాళిక లేకపోవడంతో సనత్నగర్ టిమ్స్ ప్రారంభోత్సవం అనేకమార్లు వాయిదా పడింది. కేసీఆర్కు పేరు వస్తుందనే ఈ దవాఖానల నిర్మాణాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నదనే ఆరోపణలున్నాయి. ప్రజారోగ్యానికి అత్యంత కీలకంగా మారనున్న ఈ నాలుగు దవాఖానలను వెంటనే ప్రారంభించి, ఉద్యోగ నియామకాలను పూర్తి చేయాలని పలువురు వైద్యులు కోరుతున్నారు.