హైదరాబాద్, జూలై 25(నమస్తే తెలంగాణ): అధికారం అనేది సేవ చేయడానికి ఒక సాధనం మాత్రమేనని, ప్రజాసేవే అంతిమ లక్ష్యంగా ఉండాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు పేర్కొన్నారు. రాజకీయం అంటే కేవలం ఎన్నికల్లో గెలువడం, అధికారం చెలాయించడం కాదని, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయమని స్పష్టంచేశారు. 99 టీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘స్టేట్స్‌మ్యాన్ ఎక్సలెన్స్ అవార్డ్స్-కాంక్లేవ్’లో ‘పాలిటిక్స్ బియాండ్ పవర్’ అంశంపై ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమమే గొప్ప నాయకత్వానికి, యువశక్తికి నిదర్శనమని చెప్పారు. తెలంగాణ సాధన అసాధ్యమని అంతా భావించిన సమయంలో కేసీఆర్ తన ముందుచూపు, అకుంఠిత దీక్షతో దశాబ్దాల కలను ప్రజాస్వామిక ఉద్యమంగా మలిచారని కొనియాడారు. ఆయన చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష.. ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పిందని గుర్తుచేశారు. కేసీఆర్ చూపిన మార్గంలో యువత, విద్యార్థులు తమ వ్యక్తిగత భవిష్యత్తును సైతం పకనపెట్టి పోరాడటంతోనే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని వివరించారు.
ప్రతిపక్షంలో ఉన్నా ప్రజాసేవ చేయొచ్చు
అధికారంలో ఉన్నప్పుడే కాకుండా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసం సమర్థంగా పనిచేయవచ్చని హరీశ్‌రావు చెప్పారు. దేవాదుల ప్రాజెక్టు విషయంలో ప్రతిపక్షంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి పంపులను ప్రారంభింపజేసి రైతుల పొలాలకు నీళ్లందేలా చేశామని గుర్తు చేశారు. ఇదే ప్రజాస్వామ్య స్ఫూర్తి అని పేర్కొన్నారు. నేటి జెన్‌జీ తరం తలుచుకుంటే వ్యవస్థలను మార్చగలదని అభిప్రాయపడ్డారు. యువతలోని ప్రశ్నించేతత్వం.. ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని చెప్పారు. ఇటీవల యువత చేసిన పోరాటాలే ఇందుకు ఉదాహరణ అని పేరొన్నారు. ప్రపంచ జ్ఞానం ప్రస్తుతం యువత అరచేతిలో ఉన్నదని, అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వగలదే కానీ మానవత్వంతో కూడిన ఆలోచనల ద్వారా మాత్రమే సామాజిక సమస్యలకు పరిషారం లభిస్తుందని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఫాలోవర్ల సంఖ్యతో నాయకత్వాన్ని అంచనా వేయొద్దని, వ్యక్తిత్వం, విలువలు ముఖ్యమని సూచించారు.
ప్రతి ఫైల్ వెనుక ఒక జీవితం
ప్రభుత్వ కార్యాలయంలో ప్రతి ఫైల్ వెనుక ఒక మనిషి జీవితం ఉంటుందనే బాధ్యత ప్రజాప్రతినిధులకు ఉండాలని హరీశ్‌రావు చెప్పారు. ప్రభుత్వాలు, పదవులు మారిపోతాయని, కానీ ప్రజల కోసం చేసిన సేవ మాత్రమే శాశ్వతంగా నిలుస్తుందని చెప్పారు. దేశ నిర్మాణంలో యువత ప్రేక్షకులుగా కాకుండా బాధ్యతగల పౌరులుగా భాగస్వాములు కావాలని, అధికారం కోసం కాదు.. సేవ కోసం నాయకులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. పాలిటిక్స్ బియాండ్ పవర్ అంటే స్వార్థరహిత ప్రజాసేవేనని పేరొన్న హరీశ్‌రావు.. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన లోర్వెన్ క్రాఫ్ట్స్, 99టీవీ యాజమాన్యాన్ని అభినందించారు.