కోల్‌కతా : మోదీ సర్కార్ లక్ష్యంగా పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee ) విమర్శలతో విరుచుకుపడ్డారు. దేశంలో సమాఖ్య వ్యవస్ధకు బీజేపీ తూట్లు పొడుస్తోందని ఆరోపించారు. టీఎంసీ ఆధ్వర్యంలో కోల్‌కతాలో చేపట్టిన నిరసన దీక్షలో దీదీ మోదీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. బీజేపీయేతర రాష్ట్రాలను కాషాయ పాలకులు ఎదగకుండా చేస్తున్నారని దుయ్యబట్టారు.
మన జీఎస్టీ సొమ్మునూ కేంద్ర పాలకులు లూటీ చేస్తున్నారని మండిపడ్డారు. వందరోజుల పని డబ్బును కూడా వారు నిలుపుదల చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మనం దేశ వ్యతిరేకులమని, వారే నిజమైన జాతీయ వాదులని ప్రచారం చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. దేశం పట్ల మనకు ప్రేమ లేదనే ఆలోచనా ధోరణితో వ్యవహరిస్తున్న కేంద్ర పాలకుల కండ్లు తెరిపిస్తామని అన్నారు.
బీజేపీ నేతలు ఫ్యూడల్ దొరల్లా వ్యవహరిస్తూ వారికి వ్యతిరేకంగా జరిగే నిరసనలను చూపరాదని న్యూస్ ఛానెళ్లపై ఒత్తిడి తెస్తున్నారని మండిపడ్డారు. తమ ధర్నాను ప్రసారం చేయవద్దని బీజేపీ అన్ని న్యూస్ ఛానెళ్లపై ఒత్తిడి తెచ్చిందని దీదీ అన్నారు. ప్రజాస్వామ్యానికి మీడియా నాలుగో స్తంభమని, మన ప్రజాస్వామ్యాన్ని బీజేపీ దెబ్బతీస్తోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వారిపైకి ఈడీ, సీబీఐలను ప్రయోగిస్తున్నారని ధ్వజమెత్తారు. తాను విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు కిరాయి మూకలకు డాలర్లను ఎరగా వేసి తనకు నల్ల జెండాలు చూపేలా బీజేపీ వ్యవహరించిందని దీదీ దుయ్యబట్టారు.
Read More