Mamata Banerjee | కోల్‌కతా: సీఎం పదవికి తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. ‘నేను ఓడిపోలేదు. ఇది మమ్మల్ని ఓడించే ప్రయత్నం. అధికారికంగా ఎలక్షన్ కమిషన్ ద్వారా వాళ్లు మమ్మల్ని ఓడించారు. కానీ నైతికంగా మేమే గెలిచినం. నేను గల్లీల్లో ఉన్న. ఇక మీద కూడా గల్లీల్లో ఉంటా. బీజేపీ అరాచకాలను ఎంతమాత్రం సహించను’ అని పేర్కొన్నారు.
రాజ్‌భవన్‌కు వెళ్తారా అని అడిగిన ప్రశ్నకు మమత ఘాటుగా స్పందించారు. తాను పదవి నుంచి తప్పుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రాజ్‌భవన్‌కు వెళ్లడానికి మేము ఓడిపోలేదు కదా.. ఒకవేళ ఓడిపోయి ఉంటే అప్పుడు నా రాజీనామా సమర్పించేదాన్ని. కానీ ఇప్పుడు ఆ ప్రశ్నే తలెత్తదు అని అన్నారు. బలవంతంగా నాతో రాజీనామా చేయించవచ్చని ఎవరైనా అనుకుంటే అది అసాధ్యమని స్పష్టం చేశారు. తదుపరి కార్యాచరణను అందరం కలిసి నిర్ణయిస్తామన్నారు.
ఓట్ల లెక్కింపు ప్రక్రియలో భారీగా అక్రమాలు జరిగాయని మమత ఆరోపించారు. దాదాపు 100 సీట్లలో ప్రజాతీర్పును దోచుకున్నారని, తన పార్టీ నైతిక ైస్థెర్యాన్ని దెబ్బ తీయడానికి లెక్కింపును ఉద్దేశపూర్వకంగా నెమ్మదిగా చేశారన్నారు. చరిత్రలో ఇదో చీకటి అధ్యాయం అని అన్నారు. ఓటర్ల జాబితాలో అక్రమాల గురించి చెబుతూ ‘వారు 90 లక్షల పేర్లను తొలగించారు. మేం కోర్టుకు వెళితే 32 లక్షల పేర్లను పునరుద్ధరించారు. తర్వాత కూడా మరో 7 లక్షల పేర్లను చేర్చారు. ఎలా చేర్చారో ఎవరికీ తెలియదు. నా జీవితంలో ఇలాంటి ఎన్నికలను నేను ఎప్పుడూ చూడలేదు.’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
నాపై దాడి చేశారు
లెక్కింపు కేంద్రంలో తనపై భౌతిక దాడి జరిగిందని మమత ఆరోపించారు. తనను స్వేచ్ఛగా తిరగనివ్వలేదన్నారు. తన కడుపులో, వెనక భాగంలో తన్నారని, తనను లెక్కింపు కేంద్రం నుంచి గెంటివేశారని చెప్పారు. మేం ఎవరికి ఫిర్యాదు చేయాలి? అందరూ అమ్ముడు పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత హింస జరిగిన ప్రాంతాల్లో పరిస్థితిని అంచనా వేయడానికి 10 మందితో కూడిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని వేయనున్నట్లు టీఎంసీ చీఫ్ ప్రకటించారు. సోనియా , రాహుల్, అరవింద్ కేజ్రీవాల్, ఉద్దవ్, హిమంత్ సోరేన్, తేజస్వి యాదవ్ తదితర నేతలు తనకు ఫోన్ చేసి మద్దతు తెలిపారన్నారు. ఇకపై ఇండియా కూటమిని బలోపేతం చేయడంపై దృష్టి పెడతానని చెప్పారు
రాజీనామా చెయ్యకుంటే ఏమవుతది?
బెంగాల్ ప్రభుత్వ పదవీ కాలం మే 6తో ముగియనుంది. అయితే మమత రాజీనామాకు నిరాకరించడంతో తర్వాత ఏం జరుగుతుందనే చర్చ సర్వత్రా మొదలైంది. మమత పదవిలో కొనసాగడానికి అనుమతించే అంశాలేవీ లేవని రాజ్యాంగ నిపుణులు, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ పీడీటీ ఆచార్య పేర్కొన్నారు. ఆమె రాజీనామా చేయకపోయినా సరే, అది పెద్ద విషయమేమీ కాదన్నారు. కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసేవరకు పదవిలో కొనసాగమని సాధారణంగా గవర్నర్ కోరుతుంటారని చెప్పారు. కానీ ఐదేండ్ల తర్వాత ప్రభుత్వం కొనసాగడానికి వీల్లేదని రాజ్యాంగ నిబంధన స్పష్టంగా చెబుతున్నదన్నారు.
సాంకేతికంగా చెప్పాలంటే ఆమె అసలు రాజీనామా చేయాల్సిన అవసరం కూడా లేదన్నారు. భారత రాజ్యాంగం ప్రకారం ఆమె మే 6 వరకు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉండగలరు. ఆ తేదీ ముగియగానే ఆమె సీఎం హోదా కోల్పోతారని వివరించారు. సీనియర్ అడ్వొకేట్ శేఖర్ నాఫడే కూడా పీడీటీ ఆచార్య అభిప్రాయంతో ఏకీభవించారు. టీఎంసీ అధినేత్రి మొండిగా నిరాకరించినంత మాత్రాన ఎటువంటి మార్పు ఉండదన్నారు.
ఒకవేళ ఆమె నిబంధలనకు కట్టుబడకపోతే ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయడం తప్ప గవర్నర్‌కు మరో మార్గం ఉండదని చెప్పారు. అలా చేయడం రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగానే ఉంటుందని పేర్కొన్నారు. రాజీనామా వాయిదా వేయడానికి ఎటువంటి చట్టపరమైన ఆధారం లేదని సీనియర్ అడ్వొకేట్ రెబెక్కా ఎం. జాన్ చెప్పారు. రాజకీయంగా ఆమె తన వాదనను వినిపిస్తూ ఉండవచ్చు. కానీ చట్టపరంగా చూస్తే అధికారిక రాజీనామా అనేది కేవలం ఒక మర్యాదపూర్వక సంప్రదాయం మాత్రమే. రాజ్యాంగబద్ధమైన పదవీకాలం ముగియగానే అసెంబ్లీ రద్దవుతుందన్నారు.
ఎన్నికల ఫలితాలను చాలెంజ్ చేయవచ్చా?
ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎన్నికల ఫలితాలను హైకోర్టులో సవాలు చేయవచ్చు. అభ్యర్థి ఎన్నికను సవాలు చేయడానికి, దానిని చెల్లనిదిగా ప్రకటించడానికి గల కారణాలను సెక్షన్ 100లో వివరించారు. వీటిలో రిటర్నింగ్ అధికారి నిబంధనలను పాటించకపోవడం, అభ్యర్థి అవినీతి, అక్రమాలకు పాల్పడడం వంటి కారణాలు ఉన్నాయి. ఎన్నికల పిటిషన్ ద్వారా హైకోర్టులో ఫలితాలను సవాలు చేయవచ్చని, కానీ అది ప్రత్యేక ప్రక్రియ అని ఆచార్య చెప్పారు. అందుబాటులో ఉన్న కారణాల ప్రాతిపదికన ఏదైనా కోర్టు ఎన్నికలను పక్కన పెడితే తప్ప, ఎన్నికల సంఘం ప్రకటించిన ఫలితాలకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని నాఫడే అన్నారు.