న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఇవాళ రాజ్యసభలో మాట్లాడారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా ప్రసంగిస్తూ.. కాంగ్రెస్ పార్టీకి పశ్చిమ బెంగాల్ నుంచి ఛాలెంజ్ వచ్చిందన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 40 సీట్లు కూడా దాటవని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ పేర్కొన్నారని, మీ పార్టీ ఆ 40 సీట్లును కాపాడుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. కాంగ్రెస్ నేత మల్లిఖార్జున్ ఖర్గే నేత చాలా సుదీర్ఘంగా మాట్లాడారని, అంత సమయం ఆయన ఎలా మాట్లాడారని ఆలోచించానన్నారు. ఇద్దరు కమాండర్లు లేరని, దాన్ని ఆయన అడ్వాంటేజ్ తీసుకున్నట్లు గుర్తించానన్నారు. అయిసా మౌకా ఫిర్ కహా మిలేగా అన్న పాట రీతిలో ఖర్గే మాట్లాడారని విమర్శిచారు.
కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందన్నారు. పత్రికా స్వేచ్ఛను కాంగ్రెస్ మంటగిలిపిందన్నారు. ఉత్తరం, దక్షిణం పేరుతో ప్రజల్ని విడదీస్తోందన్నారు. విపక్షాల దుస్థతికి కాంగ్రెస్ కారణం అయ్యిందన్నారు. ఫెడరలిజం గురించి కాంగ్రెస్ పార్టీ ప్రవచనాలు చెబుతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ స్థాయిలో భారత భూభాగాన్ని శత్రు దేశాలకు కాంగ్రెస్ పార్టీ అప్పగించిందని విమర్శించారు. కాంగ్రెస్‌వి అన్నీ బ్రిటీష్ భావాలే అన్నారు. ఆలోచనల్లో కాంగ్రెస్ పార్టీ ఔట్‌డేట్ అయ్యిందన్నారు. కాంగ్రెస్‌వి అన్నీ పనికిమాలిన ఆలోచనలన్నారు.