కోల్‌కతా: మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సొమవారంతో 27వ ఏట అడుగు పెట్టింది. అయితే ఇటీవల ఈ పార్టీలో సీనియర్లు, జూనియర్ల మధ్య విభేదాలు ముదిరాయి. మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైనప్పటి నుంచి ఇది కొనసాగుతున్నది. పార్టీ వ్యవహారాలపై సీనియర్లు, జూనియర్లు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకొనేంత వరకూ పరిస్థితి వెళ్లింది.
పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సంబరాల నేపథ్యంలో పలువురు సీనియర్లు అభిషేక్‌ను టార్గెట్‌గా చేసుకొని విమర్శలు చేశారు. దీనికి ఆయన వర్గం నేతలు కౌంటర్ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో అభిషేక్ బెనర్జీ సొమవారం సాయంత్రం పార్టీ అధినేత్రి మమతను ఆమె నివాసంలో కలవడం ప్రాధాన్యం సంతరించుకొన్నది. సీనియర్లు రాజకీయాల నుంచి తప్పుకోవాలన్న వాదనలను గత నెల తోసిపుచ్చిన అధినేత్రి మమత.. సీనియర్ నేతలను జూనియర్లు గౌరవించాలని సూచించారు. రాజకీయాల్లో ఒక రిటైర్మెంట్ వయసు అంటూ ఉండాలని అభిషేక్ బెనర్జీ వాదిస్తున్నారు.