న్యూఢిల్లీ: తమ రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) తప్పుల తడకగా ఉందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభివర్ణించారు. కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీ చెప్పినట్లు ఆడుతోందని ఆమె ఆరోపించారు. కోల్‌కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో టీఎంసీ బూత్ స్థాయి ఏజెంట్లతో సోమవారం జరిగిన సమావేశంలో ఆమె ప్రసంగిస్తూ ఓటరు నమోదు ప్రక్రియలో ఘోర తప్పిదాలు చోటుచేసుకుంటున్నాయని విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారమివ్వకుండా పరిశీలకులను ఎన్నికల సంఘం నియమిస్తోందని.. ఇది పారదర్శకత, ఫెడరల్ హక్కులపై ప్రశ్నలు లేవనెత్తుతోందని ఆమె తెలిపారు. సర్ విచారణల కోసం మైక్రో అబ్జర్వర్లుగా కేంద్ర ప్రభుత్వ అధికారులను ఎన్నికల సంఘం నియమించడాన్ని ఆమె తప్పుపట్టారు. ఎన్నికల కమిషన్ నుంచి మరింత ఎక్కువ జవాబుదారీతనం ఉండాలని ఆమె డిమాండ్ చేశారు.
మైనారిటీలు, బలహీన వర్గాల ఓట్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించడానికి ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)ని కేంద్ర ప్రభుత్వం ఉపయోగించుకుంటోందని తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ సోమవారం ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది ఓటర్లను జాబితా నుంచి ఈ ప్రక్రియ ద్వారా తొలగించారని ఆయన తెలిపారు.
పరిపాలన ప్రక్షాళన సాకుతో మైనారిటీలు, దళితులు, ముస్లింలను లక్ష్యంగా చేసుకునేందుకు సర్‌ను దుర్వినియోగం చేస్తున్నారని ఇదివరకు ముఖ్యమంత్రి స్టాలిన్ చేసిన వాదనను ఉదయనిధి సోమవారం విలేకరుల సమావేశంలో పునరుద్ఘాటించారు. ఓటింగ్ హక్కుల హననానికి జరుగుతున్న ప్రయత్నంగా సర్ సమీక్షను ఆయన అభివర్ణించారు. తమిళనాడు వ్యాప్తంగా దాదాపు 97 లక్షల ఓటర్ల తొలగింపు జరిగిందని, ప్రజలు తక్షణమే మేల్కొనాలని ఆయన అన్నారు.